సీఎం జ‌గ‌న్ కుంభ‌క‌ర్ణుడు.. వైఎస్ బిడ్డ ఓ వైపు.. నిందితులు ఓ వైపు

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుంభ‌క‌ర్ణుడ‌ని, నాలుగున్నరేళ్లు నిద్ర‌పోయి ఎన్నిక‌లకు ఆరు నెల‌లు ఉంద‌న‌గానే నిద్రలేచారని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు

  • Publish Date - April 7, 2024 / 07:37 AM IST

రాష్ట్రంలో అంతా హ‌త్య‌లు, మాఫియాలే

దింగత సీఎం వైఎస్‌లా సేవ చేస్తా

ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల

విధాత‌: సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుంభ‌క‌ర్ణుడ‌ని, నాలుగున్నరేళ్లు నిద్ర‌పోయి ఎన్నిక‌లకు ఆరు నెల‌లు ఉంద‌న‌గానే నిద్రలేచారని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ష‌ర్మిల చేప‌ట్టిన ఏపీ న్యాయ యాత్ర ఆదివారం కడప జిల్లా కమలాపురం నియోజక వర్గానికి చేరుకుంది. పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో ప్ర‌జ‌లు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సోదరుడు జగన్‌పై నిప్పులు చెరిగారు. పెండ్లిమ‌ర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని తాను పరామర్శించానని చెప్పారు. భూమి కోసం అత‌డిని ఎంపీ అవినాష్ అనుచ‌రులు హ‌త్య‌చేశారని ఆరోపించారు. శ్రీనివాస్‌ను రాళ్ల‌తో కొట్టి దారుణంగా చంపార‌న్నారు. అత‌ని త‌మ్ముడిని ట్రాక్ట‌ర్‌తో తొక్కించాల‌ని చూశారని చెప్పారు. అయినా.. పోలీసులు నిందితుల‌ను కాపాడాల‌ని చూస్తున్నార‌ని ష‌ర్మిల విమర్శించారు. నిందితులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచ‌రుల‌న్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్ర‌జ‌లు ఓట్లేస్తే క‌నీసం కృత‌జ్ఞ‌త లేద‌ని మండిప‌డ్డారు. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్ర‌శ్నించారు. క‌డ‌ప‌లోనే ఇంత అన్యాయం జ‌రుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎంటని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి లేద‌ని, హ‌త్య‌లు, దోపిడీలు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్ర‌మాలు, దౌర్జ‌న్యాలే క‌నిపిస్తున్నాయ‌న్నారు. వైఎస్సార్ హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు దిక్కులేదని, కడప స్టీల్ వైఎస్సార్ కల అని ష‌ర్మిల తెలిపారు. కడప స్టీల్ ఫ్యాక్ట‌రీ పూర్తి అయ్యి ఉంటే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. వివేకానంద హ‌త్య జ‌రిగి ఐదేళ్లు అయితుంది, హత్య చేసిన వాళ్ళు యదేచ్ఛగా, అధికారం అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారని ఆరోపించారు. సీబీఐ అవినాష్‌రెడ్డిని నిందితుడ‌ని చెప్పిందని, అన్ని ఆధారాలు ఉన్న‌ప్ప‌టికీ చ‌ర్య‌లు మాత్రం లేవని అన్నారు. అటువంటి వ్య‌క్తికి జ‌గ‌న్ మ‌ళ్లీ టికెట్ ఇచ్చార‌రని, ఇది హ‌త్యారాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించిన‌ట్లేన‌ని విమర్శించారు. హత్య చేసిన వారిని గెలిపించాల‌ని చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. వివేకానంద సీఎం జ‌గ‌న్‌కు స్వ‌యానా బాబాయి, అటువంటి వ్య‌క్తి హ‌త్య జ‌రిగితే క‌నీసం న్యాయం చేసే ప‌రిస్థితి లేద‌ని, నిందితుల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ కాపాడుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. నిందితుల‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంప‌వ‌ద్ద‌ని ఈసారి ఎన్నిక‌ల్లో తాను నిల‌బ‌డ్డాన‌ని చెప్పారు. న్యాయం ఒకవైపు, అధర్మం ఒక వైపు ఉంద‌ని, వైఎస్ బిడ్డ ఒక వైపు .. వివేకాను హత్య చేసిన నిందితుడు ఒక వైపు ఉన్నార‌న్నారు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయాలని కోరారు. వైఎస్సార్ లెక్క ప్రజలకు అందుబాటులో ఉంటా నమ్మకంగా సేవ చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

షర్మిల ఎంపీ కావడం వివేకా కోరిక

వివేకానంద కుమార్తె సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ప‌క్కా స్కెచ్ వేసి తన తండ్రిని హత్య చేశారని చెప్పారు. ప్ర‌జా సేవ‌లో ఉన్నాడ‌ని, వారికి అడ్డు వ‌స్తున్నాడ‌ని అడ్డుతొలిగించాల‌ని హ‌త్య‌చేశార‌న్నారు. వైఎస్ ష‌ర్మిల‌ను ఎంపీగా చూడ‌టం వివేకా కోరిక అని తెలిపారు. ష‌ర్మిల‌ను చూస్తే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని, ఆయన గుణ గ‌ణాల‌న్నీ ష‌ర్మిల‌లో ఉంటాయ‌ని చెప్పారు. షర్మిల ఉంటే వైఎస్సార్ ఉన్నట్లు ఉంటుదని వివేకా అనుకున్నారని తెలిపారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అర్థంలేని మాట‌లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వివేకా హత్య పర్సనల్ విషయమంటున్నారని, సలహాదారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోండని సునీత సూచించారు. ‘వివేకా హ‌త్య గురించి అవినాష్ రెడ్డికి ఎవరో ఫోన్ చేసి చెప్పారట, అంతా జరుగుతుంటే చూస్తూ ఉన్నాడట, అవినాష్ ఏమైనా పాలు తాగే పిల్లోడా, అదంతా జరుగుతుంటే బాధ్యత లేదా?’ అని సునీత ప్ర‌శ్నించారు.

Latest News