– 21న ముహూర్తం ఖరారు
– హాజరుకానున్న ఏఐసీసీ, పీసీసీ ప్రముఖులు
విధాత: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఇడుపులపాయ వేదికగా ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోనున్నారు. పలువురు ఏఐసీసీ, సీడబ్ల్యుసీ, పీసీసీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు మాయప్ప, క్రిస్టఫర్ తిలక్, పలువురు సీడబ్ల్యుసీ సబ్యలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు తరలిరానున్నారు.
షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమిస్తూ రెండు రోజుల క్రితం ఏఐసీసీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈనెల 21న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం. వైఎస్ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి షర్మిలకు మద్దతు పలకనున్నారు.
– వైసీపీకే నష్టం : గంటా
ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించడం వైసీపీకే నష్టమని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇన్నాళ్లూ వైసీపీ వైపు మళ్లిందని.. ఇపుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందని తెలిపారు. ఎంత శాతం ఓటు బ్యాంకు వస్తుందో చెప్పలేమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా అన్నారు. ఇదే విషయమై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందిస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ తో వైఎస్ షర్మిల చేతులు కలపడం బాధాకరమన్నారు. షర్మిల ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ కలసి రాష్ట్రానికి అన్యాయం చేశారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది వైసీపీనే అని అన్నారు.