చంద్రబాబుకు వైఎస్ షర్మిల పెండ్లి పిలుపు

వైఎస్ షర్మిల శనివారం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన షర్మిలకు చంద్రబాబు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు

  • Publish Date - January 13, 2024 / 08:23 AM IST
  • రాజకీయాలు చర్చించలేదని వెల్లడి

విధాత : కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన షర్మిలకు చంద్రబాబు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తన కుమారుడు ఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరుకావాలని కోరుతూ చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. మానాన్న దివంగత సీఎం వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబునాయుడును ఆహ్వానించడం జరిగిందన్నారు.



 


పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని, తన పెండ్లికి కూడా చంద్రబాబు వచ్చి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ తో ఉన్న స్నేహం, రాజకీయ ప్రస్థానం గురించి చంద్రబాబు గుర్తు చేసుకున్నారని వెల్లడించారు. వైఎస్సార్ గురించి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పారని, ఆయనతో కాంగ్రెస్‌లో కలిసి పనిచేసిన రోజులను తనతో ప్రస్తావించారన్నారు. ఇప్పుడు చంద్రబాబును కేవలం నా కుమారుడి పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చానని, చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు…నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నానన్నారు. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవన్నారు. వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబు ను పిలిచారని, మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు..దీవించారని గుర్తు చేశారు.


చంద్రబాబు ను కలవడంపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారన్నారు. నేను చంద్రబాబుకే కాదు అప్పట్లో కేటీఆర్, హరీష్, కవితలకు కూడా కేకు పంపడం జరిగిందన్నారు. పండుగకో, లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలు అన్నది జీవితాలు కాదన్నారు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్‌గానే చూడాలన్నారు. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్ అన్నారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటామని, కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమేనన్నారు.


అందరం ప్రజల కోసమే పని చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాద్యతలు ఇచ్చినా పనిచేస్తామని, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన అవసరముందని, మా నాన్న వైఎస్సార్ కూడా రాహుల్‌ను ప్రధానిగా చూడాలను కోరుకున్నారన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందని, లౌకిక పాలన సాగుతుందని తాను భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుంచి చేరికల అంశంపై నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చాక మాట్లాడుతానన్నారు.