విధాత:అధికార వైకాపాలో పదవుల సందడి మొదలైంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగియడంతో..మొదట్లో పదవులు సంపాదించిన కొంతమంది నాయకులు..ఇప్పుడు తమ పదవులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, పదవులు రాని వారూ, టిడిపి నుంచి వైకాపాలో చేరిన నాయకులు తమకు ఇప్పుడైనా పదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే వీళ్ల ఆశలపై నీళ్లు జల్లుతై రెండేళ్ల క్రితం పదవులు పొందిన వారు మళ్లీ తమకు పదవులు ఇవ్వాలని, గతంలో కంటే ప్రాధాన్యత కలిగిన పదవులు కావాలని కోరుకుంటున్నారు. వీరి కోర్కెలను ముఖ్యమంత్రి ఎంత వరకు నెరవేరుస్తారో తెలియదు కానీ, ఆయనకు అత్యంత ఆప్తులైన వారికి మాత్రం మళ్లీ పదవులను ఆయన కట్టబెడుతున్నారు. తనకు అత్యంత ముఖ్యులైన నలుగురు ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం పొడిగించారు. వీరి బాటలోనే మరికొందరు ఉన్నారు. అయితే..వీరి కంటే ముఖ్యులైన తన బంధువులైన వారి విషయంలో సిఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి పార్టీ వర్గాల్లోనూ,రాజకీయవర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.
ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయి వై.వి.సుబ్బారెడ్డి విషయంలో ఆయన ఎటువంటి వైఖరి అవలంభిస్తారన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. దాదాపు రెండేళ్ల క్రితం సుబ్బారెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవిని సిఎం కట్టబెట్టారు. ఆయన పదవీకాలం త్వరలో పూర్తికాబోతోంది. ఆయనకు మళ్లీ టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తారా..లేక వేరో పదవి ఇస్తారా…? అనేదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఒంగోలు ఎంపిగా ఉన్న సుబ్బారెడ్డికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని జగన్ ఆయనకు ఇవ్వలేదు. అప్పట్లో టిడిపిలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కోసం సుబ్బారెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. అప్పట్లో బాబాయికి టిటిడి ఛైర్మన్ పదవి లేక రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీ మేరకు సుబ్బారెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవిని ఇచ్చారు. ఈ పదవికాలం త్వరలో ముగియబోతోంది. దీంతో ఆయనకు మళ్లీ టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తారా..? లేక రాజ్యసభ సీటు ఇస్తారా..? అనేదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే వై.వి తనకు రాజ్యసభ సీటు వద్దని తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికలు ఇప్పట్లో లేవు కనుక ఇప్పట్లో రాజ్యసభ సంగతిని పక్కన పెట్టి ముందు మంత్రివర్గంలోకి వెళ్లాలని వైవీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా..ఒంగోలు జిల్లా నుంచి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. జగన్ రెండేళ్ల తరువాత మంత్రివర్గంలోని మంత్రుల్లో 80శాతం మందిని తొలగించానని చెప్పడంతో..బాలినేని తప్పించి..ఆయన స్ధానంలో సుబ్బారెడ్డిని తీసుకుంటారని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన, బంధువు అయిన బాలినేని తొలగించరని, ఆయనను కొనసాగిస్తూనే వై.వి.కి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ జరగవనీ, వై.వికి జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని, రాజ్యసభ ఎన్నికల వరకూ ఆయన ఖాళీగానే ఉండాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం మీద జగన్ తన బాబాయి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై పార్టీలో చర్చ సాగుతోంది.