జడ్పీ ఛైర్మన్‌ పదవులకు జాబితా ఖరారు..?

విధాత‌: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైకాపా దాదాపు ఖరారు చేసింది. జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న విషయం విదితమే. దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని అధికార వైకాపా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులపై కసరత్తు చేసింది. కొన్ని జిల్లాలకు మినహా మిగిలిన వాటికి పేర్లు ఖరారైనట్లే. చిత్తూరులో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికి వి.కోట జడ్పీటీసీగా పోటీ […]

జడ్పీ ఛైర్మన్‌ పదవులకు జాబితా ఖరారు..?

విధాత‌: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైకాపా దాదాపు ఖరారు చేసింది. జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న విషయం విదితమే. దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లనూ కైవసం చేసుకుంటామని అధికార వైకాపా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులపై కసరత్తు చేసింది. కొన్ని జిల్లాలకు మినహా మిగిలిన వాటికి పేర్లు ఖరారైనట్లే. చిత్తూరులో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికి వి.కోట జడ్పీటీసీగా పోటీ చేసిన శ్రీనివాసులు పేరు దాదాపు ఖరారు అయినట్లేనని వైకాపా నాయకులు చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు ఒకరి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆయన జడ్పీటీసీగా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత శ్రీనివాసులు గెలిస్తే ఆయనకే జడ్పీ పీఠమని వైకాపా నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరిలో ఛైర్మన్‌ పదవికి విప్పర్తి వేణుగోపాల్‌ పేరు ప్రచారంలో ఉంది. అనంతపురంలో ఆత్మకూరు జడ్పీటీసీగా పోటీ చేసిన గిరిజ పేరు ప్రధానంగా ఉంది. అయితే జక్కల ఆదిశేషు భార్య కదిరి నుంచి, ప్రవీణ్‌ యాదవ్‌ భార్య గుత్తి నుంచి పోటీ చేశారు. వీరిద్దరిపేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కర్నూలులో ఎర్రబోతుల వెంకటరెడ్డిని గతంలోనే ఖరారు చేశారు. వెంకటరెడ్డి మృతి చెందడంతో ఆయన కుమారుడు ఉదయ్‌కుమార్‌రెడ్డికి అవకాశం కల్పించాలని వైకాపా అధినాయకత్వం నిర్ణయించింది. ఆయన జడ్పీటీసీగా పోటీ చేయాల్సి ఉంది. అందువల్ల తాత్కాలికంగా వేరే వారికి బాధ్యతలు అప్పగించి, ఎన్నికలయ్యాక ఉదయ్‌కే అవకాశం ఇస్తారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.
కొలిక్కిరాని శ్రీకాకుళం..! శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనేదీ తేలడం లేదు. గతంలో ఒక మహిళ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇటీవల కార్పొరేషన్ల పదవుల్లో ఆమెకు డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. అందువల్ల ఇప్పుడు వేరే వారి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరు మహిళల పేర్లు జిల్లాలో ప్రచారంలో ఉన్నా… ఎలాంటి ధ్రువీకరణ రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో ఒకరికి కేటాయింపు…! ఒక మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రెండూ ఓసీలకు కేటాయించి ఉంటే…వాటిలో ఎంపీపీ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఒకరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఫలితాల అనంతరం దీని అమలు ప్రక్రియపై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది.
ఏయే జిల్లాలకు ఎవరెవరంటే
విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
విశాఖపట్నం – శివరత్నం
గుంటూరు – క్రిస్టినా
ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ
పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్‌
కృష్ణా – ఉప్పాళ్ల హారిక
కడప – ఆకేపాటి అమర్నాథరెడ్డి
నెల్లూరు – ఆనం అరుణమ్మ