నాన‌మ్మ శివస్తోత్రం వింటూ.. త‌ల్లి గ‌ర్భం నుంచి బ‌య‌ట‌కొచ్చిన మ‌నువ‌డు

ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో అత్త శివ కీర్త‌న‌లు జ‌పిస్తుండ‌గా.. ఆమె కోడ‌లు పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని జిల్లాలో మార్చి 27వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

  • Publish Date - March 30, 2024 / 02:43 AM IST

ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో అత్త శివ కీర్త‌న‌లు జ‌పిస్తుండ‌గా.. ఆమె కోడ‌లు పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని జిల్లాలో మార్చి 27వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉజ్జ‌యినిలోని మంచ‌మ‌న్ కాల‌నీకి చెందిన ఉపాస‌న దీక్షిత్‌కు నెల‌లు నిండాయి. దీంతో తీవ్ర‌మైన నొప్పులు రావ‌డంతో జేకే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉపాస‌న ఆరోగ్య ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా త‌యారైంది. దీంతో అత్త ప్రీతి దీక్షిత్, కోడ‌లు ఉపాస‌న తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌న అత్త‌ను ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోనే ఉంచాల‌ని కోడ‌లు డాక్ట‌ర్ల‌ను ప్రాధేయ‌ప‌డింది. మొత్తానికి డాక్ట‌ర్ల అనుమ‌తితో డెలివ‌రీ స‌మ‌యంలో అత్త ప్రీతి ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోనే ఉండిపోయింది.

ఇక కోడ‌లికి డెలివ‌రీ చేస్తుండ‌గా, అత్త శివ కీర్త‌న‌లు పాడి.. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం నింపింది. 20 నిమిషాల పాటు అత్త శివ నామ‌స్మ‌ర‌ణ‌లో మునిగిపోగా, అంత‌లోనే కోడ‌లు పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో అత్త త‌న మ‌నువ‌డిని చూసి మురిసిపోయింది.

ఈ సంద‌ర్భంగా అత్త మాట్లాడుతూ.. ఏడేండ్ల క్రితం త‌న చిన్న కుమారుడు సౌర‌భ్ దీక్షిత్ ఇదే తేదీలో చ‌నిపోయాడ‌ని, ఇప్పుడు అదే రోజున త‌న‌కు మ‌నువ‌డు జ‌న్మించ‌డం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆ శివుడి వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు. త‌న మ‌నువ‌డి రూపంలో త‌న కొడుకు మ‌ళ్లీ ఇంటికి తిరిగొచ్చాడ‌ని చెబుతూ అత్త ప్రీతి క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. 

Latest News