Titan Mishap | తలా రెండు కోట్ల‌తో మృత్యువును కోరి కొనుక్కున్నారు.

Titan Mishap | టైటానిక్ ద‌గ్గ‌ర‌లో పేలిపోయిన టైటాన్‌(Catastrophic Implosion) ఐదుగురు ప్ర‌యాణీకులు దుర్మ‌ర‌ణం అధికారికంగా ప్ర‌క‌టించిన ఓష‌న్‌గేట్ సంస్థ‌ మినీ జ‌లాంత‌ర్గామిలో లోప‌మే కార‌ణ‌మా? కోట్ల డాల‌ర్ల ఖ‌ర్చు, నాలుగు దేశాలు, ప‌దుల సంఖ్యలో ఓడ‌లు, విమానాలు, రోబోలు… ఇదంతా ఆదివారం నాడు గ‌ల్లంతైన మినీ జ‌లాంత‌ర్గామి టైటాన్‌ను అన్వేషించాడానికి జ‌రిగిన బృహ‌త్‌ప్ర‌య‌త్నం. దురదృష్ట‌వ‌ శాత్తు అంతా వ్య‌ర్థం. టైటాన్ బ‌య‌లుదేరిన కాసేప‌టికే పేలిపోయిన‌ట్లు అమెరిక‌న్ కోస్ట్‌గార్డ్ ( US Coast guard) నిర్ధారించింది. అందులో […]

  • Publish Date - June 23, 2023 / 12:07 PM IST

Titan Mishap |

  • టైటానిక్ ద‌గ్గ‌ర‌లో పేలిపోయిన టైటాన్‌(Catastrophic Implosion)
  • ఐదుగురు ప్ర‌యాణీకులు దుర్మ‌ర‌ణం
  • అధికారికంగా ప్ర‌క‌టించిన ఓష‌న్‌గేట్ సంస్థ‌
  • మినీ జ‌లాంత‌ర్గామిలో లోప‌మే కార‌ణ‌మా?

కోట్ల డాల‌ర్ల ఖ‌ర్చు, నాలుగు దేశాలు, ప‌దుల సంఖ్యలో ఓడ‌లు, విమానాలు, రోబోలు… ఇదంతా ఆదివారం నాడు గ‌ల్లంతైన మినీ జ‌లాంత‌ర్గామి టైటాన్‌ను అన్వేషించాడానికి జ‌రిగిన బృహ‌త్‌ప్ర‌య‌త్నం. దురదృష్ట‌వ‌ శాత్తు అంతా వ్య‌ర్థం. టైటాన్ బ‌య‌లుదేరిన కాసేప‌టికే పేలిపోయిన‌ట్లు అమెరిక‌న్ కోస్ట్‌గార్డ్ ( US Coast guard) నిర్ధారించింది. అందులో ఉన్న ప్ర‌యాణీకులు దుర్మ‌ర‌ణం పాలైన‌ట్లు టైటాన్ మాతృసంస్థ ఓష‌న్‌గేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపింది. మృతుల‌లో ఆ సంస్థ సిఈఓ కూడా ఉండ‌టం పెను విషాదం.

సోమ‌వారం నాడు అన్వేష‌ణ‌లో ఉన్న నౌక‌లు, సోనార్ ప‌రిక‌రాల‌ను జార‌విడిచిన విమానాలు తాము కొన్ని శ‌బ్దాల‌ను రికార్డు చేసిన‌ట్లు తెలిపారు. అవి టైటానిక్ అవ‌శేషాల ప్రాంతంనుండే వ‌స్తున్న‌ట్లు తెలిపారు. కానీ, అవి టైటాన్‌వేనా కాదా అనేది వారు ఇద‌మిద్దంగా చెప్ప‌లేక‌పోయారు. తుద‌కు గురువారం నాడు యుఎస్ కోస్ట్‌గార్డ్, టైటానిక్ ప్ర‌దేశంలో అన్వేష‌ణ నిర్వ‌హిస్తున్న ఓ ఆర్ఓవి (రిమోట్లీ ఆప‌రేటెడ్ వెహికిల్‌- ROV) టైటాన్ శ‌క‌లాల‌ను గుర్తించింద‌ని ప్ర‌క‌టించ‌డంతో అంత‌టా విషాదం అలుముకుంది.

(ఇదే ఆ మృత్యువాహ‌నం – ఓష‌న్‌గేట్ టైటాన్‌) – Oeangate Titan

టైటాన్ బ‌య‌లుదేరిన న్యూఫౌండ్‌ల్యాండ్‌కు ద‌క్షిణాన 640 కి.మీ దూరంలో, 13వేల అడుగుల లోతులో ఈ ప్రాంతం ఉంది. దీన్ని మిడ్‌నైట్ జోన్ (midnight zone) గా పిలుస్తారు. కాగా టైటాన్ బ‌య‌లుదేరిన రెండు గంట‌ల‌లోపే తాము ఒక పేలుడు శబ్దాన్ని గుర్తించామ‌ని అమెరికా నౌకాద‌ళం (American Navy) తాజాగా ప్ర‌క‌టించింది. ఆ విష‌యాన్ని వెంట‌నే కోస్ట్‌గార్డ్‌కు తెలియ‌జేసిన‌ప్ప‌టికీ, ఎవ‌రైనా స‌జీవంగా ఉన్నారేమోన‌న్న ఆశ‌తో సెర్చ్‌-రెస్క్యూ (search & rescue) అప‌రేష‌న్‌ను నిలిపివేయ‌లేక‌పోయామ‌ని నేవీ వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్‌(WSJ) కు తెలిపింది.

చివ‌రికి టైటాన్ అంత‌మ‌యింద‌ని, దాన్లోని ప్ర‌యాణీకులు, బ్రిటిష్ బిలియ‌నీర్ హ‌మిష్ హార్డింగ్‌ (Hamish Harding ), బ్రిటిష్ పాకిస్తానీ తండ్రీకొడుకులు ష‌హ‌జాదా దావూద్‌, సులేమాన్ దావూద్‌(19) ( Shahzada Dawood and his son Suleman), ఫ్రెంచ్ స‌ముద్ర‌సాహ‌సికుడు నార్గోలెట్‌(PH Nargeolet) ఇంకా ఓష‌న్‌గేట్ సంస్థ సిఈఓ స్టాక్‌ట‌న్ ర‌ష్‌ (Stockton Rush) దుర్మ‌ర‌ణం పాల‌య్యార‌ని ప్ర‌క‌టించ‌డంతో, గంపెడాశ‌తో ఎదురుచూస్తున్న వారి కుటుంబాల‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా తీవ్రఉత్కంఠత‌ నెల‌కొన్న‌ ఈ విష‌యం దుర్ఘ‌ట‌న వ‌ల్ల‌ అంత‌మ‌మ‌డంతో ప్ర‌జ‌లు ఖిన్నుల‌య్యారు.

( మృతులు – ష‌హ‌జాదా దావూద్‌, సులేమాన్ దావూద్‌(19), నార్గోలెట్‌, స్టాక్‌ట‌న్ ర‌ష్‌, హ‌మిష్ హార్డింగ్‌)

అంతా అప‌ర కుబేరులే!

మునిగిపోయిఉన్న టైటానిక్ మ‌హానౌక‌ను సంద‌ర్శించ‌డానికి ఓష‌న్‌గేట్ సంస్థ ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక టూర్‌ను నిర్వ‌హిస్తుంది. దీన్లో భాగంగా స‌ముద్రం అడుగుభాగాన ఉన్న టైటానిక్‌ను చేర‌డానికి టైటాన్ అనే ఒక మినీ జ‌లాంత‌ర్గామిని వినియోగిస్తుంది. ఇప్పటికి రెండు సార్లు టైటానిక్ యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన టైటాన్ ఈసారి కూడా ప్ర‌యాణానికి సిద్ధ‌మైంది.

అయిదుగురు ప్ర‌యాణీకులు త‌యార‌య్యారు. అందులో స్వ‌యంగా ఆ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు, సిఈఓ అయిన స్టాక్‌ట‌న్ ర‌ష్‌, బ్రిటిష్‌-పాకిస్తానీ కుబేరుడు ష‌హ‌జాదా దావూద్‌, త‌న కుమారుడు సులేమాన్ దావూద్‌, మ‌రో బ్రిట‌న్ బిలియ‌నీర్ హ‌నీష్ హార్డింగ్‌, నావికుడు, జ‌లాంత‌ర్గ‌త ప్ర‌యాణ నిపుణుడు పిహెచ్ నార్గోలెట్‌ ఉన్నారు. వీరు త‌లా 2 ల‌క్ష‌ల యాభైవేల డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో దాదాపు 2కోట్ల రూపాయ‌లు) వెచ్చించి, ఈ సాహ‌స‌యాత్ర‌కు పూనుకున్నారు.

ఈ యాత్రే త‌మ అంతిమ‌యాత్ర అని తెలియ‌ని వారు ఎంతో ఉత్సాహంతో బ‌య‌లుదేరారు. కానీ, బ‌య‌లుదేరిన 2 గంట‌ల లోపే పెనువిషాదం చోటుచేసుకుంది. టైటాన్ గ‌ల్లంత‌యింది. ఈ విష‌యం ప్ర‌పంచానికి తెలిసేట‌ప్ప‌టికి ప్ర‌మాదం జ‌రిగి ఏడెనిమిది గంట‌లైంది. అందులో ఉన్న ఆక్సిజ‌న్ 96 గంట‌ల‌కే స‌రిపోతుంది. ప్ర‌యాణీకులు అప‌ర‌కుబేరులు కావ‌డంతో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అన్వేష‌ణ ప్రారంభ‌మైంది. ఆదివారం సాయంత్రం నుండి మొద‌లైన వెతుకులాట‌, గురువారం రాత్రికి విషాద‌వార్త‌తో ఆగిపోయింది. కాగా ఈ విషాద‌వార్త‌ను తెలిపిన ఆర్ఓవీ ఇంకా అక్క‌డే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

(టైటాన్ లోప‌లిభాగం – పాత‌ఫోటో)

గ‌త రెండేళ్లు విజ‌య‌వంతంగా యాత్ర పూర్తిచేసుకున్న టైటాన్‌ను ఈసారి పూర్తిస్థాయిలో ప్ర‌యాణానికి స‌న్న‌ద్ధం చేయ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌తీ ప్ర‌యాణానికి ముందు విమానాల‌కు జ‌రిగే అత్యంత సునిశిత‌మైన ప‌రీక్ష‌లు, దీనికి కూడా చేయాల‌ని, ఏమాత్రం చీలిక‌లున్నా, లీకేజీలున్నా ఘోర ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని ఇంత‌కుముందే జ‌లాంత‌ర్గామి నిపుణులు హెచ్చ‌రించారు. ఈసారి వాటిని స్వ‌యంగా సిఈఓ ర‌ష్ పెడ‌చెవిన పెట్టాడ‌నే ఆరోప‌ణ‌లు వినిసిస్తున్నాయి.

నిజానికి 13వేల అడుగుల లోతులో స‌ముద్ర‌మ‌ట్టానిక‌న్నా దాదాపు 380 రెట్లు ఎక్కువ‌గా పీడ‌నం ఉంటుంద‌ని చెపుతున్నారు. అటువంటి ప‌రిస్థితుల్లో ఏమాత్రం తేడా జ‌రిగినా, ఒక మిల్లీ సెక‌నులోపే ఆ జ‌లాంత‌ర్గామి పేలిపోతుంద‌ని, అందులోని మ‌నుషులు కూడా ఆ ఒత్తిడికి ఆన‌వాలు లేకుండా పేలిపోతార‌ని శాస్త్రజ్ఞులు వివ‌రించారు.

Latest News