విధాత, హైదరాబాద్ : ఖమ్మం వెలుగుమట్ల భూబాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. సోమవారం ఖమ్మంలో ఆందోళన చేపట్టిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు.
ఆ రాత్రే బాధితులతో కలిసి దీక్ష ప్రారంభించగా, మంగళవారం పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.
దిగొస్తున్న ఖమ్మం మంత్రులు!
‘వెలుగుమట్ల’ భూదాన్ నిర్వాసితుల ఇళ్లను బలవంతంగా కూల్చి ఖాళీ చేయించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందే బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్దమైనట్లుగా సమాచారం. 311 మందికి ఇంటి స్థలం పట్టాతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరీ పత్రం అందించనున్నారు. ఇప్పటికే స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇంటి మంజూరీ పత్రాలు పంపిణీ చేస్తారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ (IDOC) వేదికగా భూదాన్ నిర్వాసితులకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ వసతి లభించనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అదే భుదాన్ భూముల్లో 5 లేదా 6 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేయనున్నారు. తలా 75 గజాల చొప్పున ఇండ్ల పట్టాలను సిద్దం చేశారు. 700 ఇండ్లు కూల్చి, 311 మందినే బాధితులుగా చెబుతూ వారికి మాత్రమే పట్టాలు , ఇళ్లు పంపిణీ చేస్తుండటంతో మిగతా బాధితులు తమ పేర్లు రాకపోవడంతో ఆందోళనగా కలెక్టరేట్ చేరుకున్నారు. ప్రభుత్వం ఇండ్లు కూల్చిన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ 1954 నుండి 1985 వరకు 62 ఎకరాల 7 గుంటల భూమి రెవిన్యూ రికార్డ్స్‌లో ఉంది.ఇప్పుడు మిగతా 30 ఎకరాల భూమి ఏమయిందన్నది మరో ప్రశ్నగా మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి :
NTR | ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు తగ్గాడా.. కొత్త లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
Danam Kadiyam Disqualification Case | దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చీట్.. అనర్హత పిటిషన్ల కొట్టివేత
