విధాత, హైదరాబాద్ : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు భారీగా ఫీజును తగ్గించింది. ఈ క్రమంలోనే కళాశాల యాజమాన్యాలకు సర్కారు తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప, అదనంగా వేరే ఏ రుసుమును వసూలు చేయకూడదనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ మేరకు కొత్త ఫీజుల జీఓల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పెషల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో రుసుములను వసూలు చేస్తున్నాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
గతంలోని నిబంధనలు రద్దు
గతంలో ట్యూషన్ ఫీజుతో పాటు వేరే రుసుముల పేరిట విద్యార్థుల నుంచి రూ. 8,500 వసూలు చేసుకోవడానికి అనుమతించారు. అందులో రూ.2 వేలు కళాశాలలు విశ్వవిద్యాలయాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల జీఓలో ప్రత్యేక ఫీజులను కూడా పొందుపరిచేవారు. ఈసారి జీఓల్లో వాటి ప్రస్తావన లేదు. ట్యూషన్ ఫీజులో స్పెషల్ ఫీజు, అడ్మిషన్ ఫీజును చేర్చలేదని, ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) కోరినట్లు జీఓలో ఉంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం తమకు టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించిన ఫీజులనే ఖరారు చేశామని, ప్రత్యేక రుసుములను సిఫార్సు చేయలేదని పేర్కొంటున్నాయి. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు ప్రత్యేక ఫీజులపై ఉన్నతాధికారులతో చర్చించి.. స్పష్టతనిస్తామని పేర్కొన్నాయి. అనంతరం ట్యూషన్ ఫీజు తప్ప..ఇతర పేర్లతో ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.
అనుమతి మూరెడు…వసూళ్లు బారెడు
గతంలో రూ.8,500 అదనపు ఫీజు అనుమతి ముసుగులో కళాశాలలు మాత్రం అనధికారికంగా రూ.12,000-రూ.16,000 వరకు వసూళ్లు చేశాయి. ఈ రకంగా ఏటా కనీసం రూ. 25 కోట్ల నుంచి రూ.35 కోట్ల దాకా అదనంగా ఫీజును వసూలు చేస్తున్నాయని, బీటెక్ నుంచే కాకుండా ఇతర కోర్సుల వారిగా చూసుకుంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగా అదనపు ఫీజుల దోపిడీ సాగిందని అంచనా వేశారు.
అదనపు ఫీజుల జాబితాలో ప్రవేశ సమయంలో విద్యార్థులు మొదట రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపు సర్టిఫికేట్ ఫీజు పేరిట రూ. 2 వేలు, కళాశాల ఉత్సవాలు, రీడింగ్ రూమ్, మేగజైన్, ల్యాబ్, లైబ్రరీ, , కంప్యూటర్, ఇంటర్‌నెట్, గేమ్స్, ప్రాంగణ నియామకాలకు రూ. 1000 అదనపు ఫీజును కలెక్ట్ చేసేవారు. కాలేజీలకు యూనివర్సిటీలు కామన్ సర్వీస్ అందించేందుకు రూ.1500 చెల్లించాలి. పరీక్షల నిర్వహణ, పాఠ్య ప్రణాళిక మార్పు, లెక్చరర్స్ ట్రైనింగ్, వెబ్‌సైట్ నిర్వహణ తదితర సేవలకు వాటిని వసూలు చేసేవారు. గ్రంథాలయ, ప్రయోగశాల డిపాజిట్ కింద రూ.1000 చెల్లించాలి. వాటిని కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థికి చెల్లించాలి. అలాగే కాలేజీల్లోని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) ఐడెంటిఫికేషన్ ఉంటే ఎంట్రెన్స్ టైంలో ట్యూషన్ ఫీజు ఏడాదికి అదనంగా మరో రూ.3 వేలు వసూలు చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవోతో ఆయా ఫీజుల వసూళ్లకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.
కొత్త జీవో…కాలేజీల వారిగా ఇంజనీరింగ్ ఫీజుల వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 160 ఇంజినీరింగ్ కళాశాలకు కొత్త ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ.. విద్యాశాఖ జీవో 6ను జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటివరకు 19 కళాశాలల్లో ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించింది. ఈ కళాశాలల్లో ప్రస్తుతం తగ్గించిన ఫీజు కంటే గత విద్యాసంవత్సరం (2024-25) ఫీజు ఎక్కువ చెల్లిస్తే..ఆ మేరకు తిరిగి విద్యార్థులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు 70 కళాశాలలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. కనీస ట్యూషన్ ఫీజు రూ.45,000 ఉండగా, 21 కాలేజీలకు ఆ ఫీజును ఖరారు చేశారు. రాష్ట్రంలోని 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.1 లక్షకు పైగా, 2 కళాశాలలకు రూ.1 లక్షగా ఫీజును ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. గత బ్లాక్ పీరియడ్ లో రూ.1లక్ష ఫీజు దాటిన కాలేజీల 7 ఉండగా..తాజా జీవోతో ఆ సంఖ్య ఇప్పుడు 2కి తగ్గింది.
అత్యధికం సీబీఐటీలోనే…
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పేరుమోసిన సీబీఐటీకి ఫీజు రూ.1.83 లక్షలుగా ప్రభుత్వం కొత్త జీవోలో నిర్ణయించింది. రూ.1.75 లక్షలతో వాసవి కాలేజీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమలులోనికి రానున్నాయి. మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్ అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ ఫీజులు వర్తిస్తాయి. ఈ విద్యార్థులు నాలుగు సంవత్సరాల పాటు ఇవే రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.
రూ.లక్షకు పైగా ఫీజుల కళాశాలల వివరాలు :
కళాశాల పేరు ఫీజు మొత్తం
సీబీఐటీ రూ.1.83 లక్షలు
వాసవి రూ.1.75 లక్షలు
ఎంజీఐటీ రూ.1.67 లక్షలు
సీవీఆర్ రూ.1.63 లక్షలు
నారాయణమ్మ రూ.1.62 లక్షలు
గోకరాజు రూ.1,60,500
వీఎన్ఆర్ రూ.1,59,600
బీవీఆర్ఐటీ రూ.1,46,600
కిట్స్ రూ.1,46,200
ఎంవీఎస్ఆర్ రూ.1,43,800
బీవీఆర్ఐటీ మహిళలురూ.1,43,500
ఎస్ఆర్ రూ.1.41 లక్షలు
వర్ధమాన్ రూ.1.40 లక్షలు
శ్రీదేవి రూ.1.37 లక్షలు
శ్రీనిధి రూ.1.33 లక్షలు
కేఎంఐటీ రూ.1,29,200
గురునానక్ టెక్నికల్ రూ.1.29 లక్షలు
ముఫకంజా రూ.1.25 లక్షలు
విజ్ఞాన్ రూ.1.23 లక్షలు
గీతాంజలి రూ.1.21 లక్షలు
శ్రీఇందు రూ.1.15 లక్షలు
ఏఎస్ రూ.1.10 లక్షలు
జేబీఐటీ రూ.1.10 లక్షలు
అను బోస్ రూ.1,04,900
శ్రేయాస్ రూ.1.06 లక్షలు
జేబీఐటీ రూ.1.10 లక్షలు
హితమ్ రూ.1,04,900
విజ్ఞాన్స్ మహిళలు రూ.1,04,400
వీబీఐటీ రూ.1,03,200
టీకేఆర్ రూ.1,02,900
కేజీ రెడ్డి రూ.1,02,900
శ్రీదత్త రూ.1,01,100
లార్డ్స్ రూ.1,00,100
లక్ష ఫీజు కళాశాలలు :
గేట్ ఇన్స్టిట్యూట్ : రూ. 1,00,000
మాతృశ్రీ కళాశాల : రూ. 1,00,000
ఇవి కూడా చదవండి :
IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?
వ్యవసాయానికి సాంకేతికత వెన్నుదన్ను : చంద్రబాబు
