వ్యవసాయానికి సాంకేతికత వెన్నుదన్ను : చంద్రబాబు

వ్యవసాయంలో ఐటీ, ఏఐ సాంకేతికతను జోడించి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు.

వ్యవసాయానికి సాంకేతికత వెన్నుదన్ను : చంద్రబాబు

అమరావతి :- ఐటీ, క్వాంటం, ఏఐ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే.. వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా అలాంటి టెక్నాలాజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పరిపాలన లక్ష్యాలపై ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలని, ఇందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా తెచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలి అని చంద్రబాబు తెలిపారు. ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోందని, అరటి, గుడ్ల ధరలు పడిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ సమయంలో మనం ప్రేక్షక పాత్ర పోషించకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

13న అన్నదాద సుఖీభవ నిధులు

13 తేదీన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేస్తున్నామని చంద్రబాబు వెల్లడంచారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుంది అని తెలిపారు. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్లాలని, ఈ పథకం గురించి చెప్పాలని సూచించారు. ఖరీఫ్ సాగు కోసం మే 15 తేదీన నీటిని విడుదల చేస్తున్నాం. సీజన్లో ముందుగానే నీరు ఇస్తాం. మే 15 నుంచే సాగుకు సిద్దం అవుదాం. ఏఐ అగ్రానమిస్ట్ సేవలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ వ్యవసాయ దారుడికి ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలి”అని ముఖ్యమంత్రి సూచించారు.

ఉగాది కానుకగా 2.50లక్షల గృహప్రవేశాలు

ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తాం అని చంద్రబాబు తెలిపారు. జూన్ నెలలో మరికొన్ని ఇళ్లను లబ్దిదారులకు ఇస్తాం. ఇల్లు, ఇంటి జాగా కూడా మూడేళ్లలో ఇవ్వాల్సి ఉంది. ఇంద్ర ధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు. తొలిసారి ట్రూ డౌన్ చేశాం. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఏడాది 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తాం. కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నాం. సబ్ స్టేషన్ యూనిట్ గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలని సూచించారు. 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం.భూ వివాదాలు లేకుంటే 70 శాతం సమస్యలు తీరినట్లేనని, ఎక్కడా భూ వివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు నిర్దేశించారు.

ప్రజల ప్రాణాల పట్ల ఉదాసీనత ఉంటే సహించం

శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీ పాలు, వేట్లపాలెం బాణసంచా లాంటి ఘటనలు బాధాకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటాం. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయి…? బాణా సంచా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారు..? కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. పంట కాల్వల పూడికతీత, చెరువుల లింకేజీకి 90 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాలని, జల్ జీవన్ మిషన్ గడువు పెంచడాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రాజెక్టుల లక్ష్యాలను సాధించాలి

గడచిన రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.82 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి అని, మార్చి 1 నాటికి 8.10 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయని, ఏప్రిల్ 1 నుంచి జూన్ నెలాఖరు వరకూ 90 రోజుల పాటు నీటి సంరక్షణా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. నో సబ్ మెర్జెన్స్ విధానంలో కాలువల పూడికలు, చెరువుల లింకేజి లాంటి కార్యాచరణ చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 614 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో సాగు సీజన్ ను ముందుకు తీసుకు వచ్చేలా ప్రణాళిక చేస్తున్నాం. భూగర్భ జలాలు పెరిగితే ప్రభుత్వం ఇస్తున్న రూ. 14 వేల కోట్ల విద్యుత్ సబ్సీడీలు భారం తగ్గుతుంది. వెలిగొండను జూలై నాటికి పూర్తి చేసి నీటిని ఇస్తాం. 30 ఏళ్ల క్రితం నేనే శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

చంద్రబాబుదే ఆర్థిక విధ్వంసం : వైఎస్.జగన్
PM Kisan | రైతులకు గుడ్‌న్యూస్.. మార్చి 13న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు!