చంద్రబాబుదే ఆర్థిక విధ్వంసం : వైఎస్.జగన్
చంద్రబాబు పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. భారీ అప్పులు చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
విధాత: సీఎం చంద్రబాబు పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం సాగుతుందని..ఇందుకు కాగ్ లెక్కలే చిత్రపటాలు, సాక్ష్యాలు, ఆధారాలు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం 2024-25లో ఏకంగా రూ.81 వేల కోట్లకుపైగా అప్పులు చేశారు అని, 2025-26 లోని 10 నెలల కాలంలోనే ఏకంగా రూ.87 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఎడాపెడా అప్పలు చేసినా..సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు అమలు చేయడం లేదని, మా హయాంలో కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం అని జగన్ పేర్కొన్నారు.
హామీలన్నింటిలోనూ ఎగవేతలే
కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారని, ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారని, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు అని జగన్ ఆరోపించారు. పెన్షన్ల కింద బడ్జెట్‌లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమేనని, భవిష్యత్‌లో మరింత మంది పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది అని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో 60 ఏళ్ల లోపు మహిళలకు 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్‌సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం అని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించిందని, తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అని, ఇచ్చిన వారిలో కూడా ఏ ఒక్కరికి పూర్తిగా రూ.15000 ఇవ్వలేదు అని జగన్ తెలిపారు.
పరస్పర జాకీలు..సెల్ఫ్ డబ్బాలతోనో అసెంబ్లీ సమావేశాలు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ లు పరస్పరం జాకీలు పెట్టుకుని పైకి లేపుకునే ప్రయత్నాలు, సెల్ఫ్ డబ్బాలు, తప్పుడు లెక్కల మయంగా అసెంబ్లీ సమావేశాలు సాగాయని జగన్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఎక్కడా లేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా అని జగన్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి కూటమి ప్రభుత్వం రూ.1.08 లక్షలు బకాయి పడిందని, 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ పెండింగ్ లోనే పెట్టారని, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని ఇవ్వడం లేదని జగన్ విమర్శించారు. దోచుకోవడం, పంచుకోవడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని ఆరోపించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో పేదలకు గజం స్థలం, ఒక్క ఇట్లు కూడా ఇవ్వలేదని, మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం అని గుర్తు చేశారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు అని, స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని జగన్ విమర్శించారు.
చంద్రబాబు మాటలను జనం నమ్మడం లేదు
ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే కొత్తగా పాపులేషన్ పాలసీ పేరుతో ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెబుతున్నాడని, పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు అని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తామంటున్నాడని..అసలు చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా? అని జగన్ ప్రశ్నించారు. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని డైలాగులు మీద డైలాగులు చెప్పే చంద్రబాబు జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైన, టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడుపైన, మహిళలను వేధించిన కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపైన చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని జగన్ నిలదీశారు.
ఇవి కూడా చదవండి :
Harish Rana Passive Euthanasia : 13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!
Kavitha Hunger Strike : మూడవ రోజుకు చేరుకున్న కవిత నిరహార దీక్ష
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram