• Telugu News
  • /National

Harish Rana Passive Euthanasia : 13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!

13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి, వైద్య నివేదికల ఆధారంగా చికిత్స నిలిపివేయొచ్చని తీర్పు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 11, 2026, 1:27 pm IST
Read Time: 4 mins
Harish Rana Passive Euthanasia : 13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!

విధాత : కోమాలో ఉన్న కుమారుడికి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తల్లిదండ్రులు సాగించిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలకు గురైన హరీశ్ రాణా(32) దాదాపుగా 13ఏళ్ల పాటు కోమాలో జీవచ్చవంలా ఉండిపోయాడు. అతడి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు హరీశ్ రాణా కారుణ్య మరణానానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాణాకు చికిత్స నిలిపివేయవచ్చంటూ..అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.

ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదలలేని స్థితికి చేరుకుంది. ప్రఖ్యాత ఆసుపత్రులను, వైద్యులను సంప్రదించి చికిత్స అందించినప్పటికి అతడు కోమా నుంచి కోలుకోవడం లేదు. చేసేది లేక అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్ బాగోగులు చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది.

ఇటీవల వైద్యులు హరీశ్‌ కోలుకునే అవకాశం లేదని మరోసారి ఇచ్చిన నివేదికల ఆసరాతో అతడి కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారణ చేపట్టింది. ఈ ఏడాది జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను విన్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని అప్పుడు వారు కోర్టును అభ్యర్థించారు. వారి వినతి మేరకు ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా కారుణ్య మరణానికి అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి :

Kavitha Hunger Strike : మూడవ రోజుకు చేరుకున్న కవిత నిరహార దీక్ష
Vijayawada | న‌పుంస‌కుడ‌ని తెలిసి కూడా పెళ్లి చేశారు.. ఓ న‌వ వ‌ధువు ఆవేద‌న ఇదీ..