హైలైట్స్:
- లక్షల ఎకరాలు చేర్చారన్నది అవాస్తవం
- యుఎల్‌సీపై త్వరలో విధాన నిర్ణయం
- బీఆర్ఎస్ కోరితే పత్రిక ఎం.డీ భూ వ్యవహారంపై సెట్ దర్యాప్తు
- రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దైతే వారి సొమ్ము వారం రోజుల్లో చెల్లింపు
- తప్పిదం మూలంగానే సీఎంతో పాటు తన ఇళ్ళు పీఓబీ జాబితాలోకి
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ పేరిట ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతాన్ని సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఉంచుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 22ఏ లో ఉన్న ఆస్తులకు సంబంధించి ఇంతవరకు వచ్చిన దరఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని దీనిపై దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. 22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని, 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు వెల్లడించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి నిషేధిత జాబితాలో ఉన్న ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేట్ భూములు తదితర వివరాలను కేటగిరీల వారీగా మొత్తం వివరాలను మంత్రి పొంగులేటి వివరించారు.
సోమవారం నాడు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మీడియా తో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటం 22ఏ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించినవి ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ భూముల వ్యవహారంపై అప్పట్లో మీడియాలో కూడా చర్చకు వచ్చిందని, ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టడం తప్పా ? ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ, సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి దారదత్తం చేశారన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్‌ను పేర్కొనడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంతో పాటు తన నివాసం కూడా పీఓబీలో చేర్చారని, ఆ తరువాత దానిని గుర్తించి వెంటనే సరిచేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేట్ భూమి అని, 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఉదాహరణను మంత్రి వివరించారు. ప్రైవేట్ సర్వే నంబర్ పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తే.. ఆ ప్రభుత్వ భూమిని 22ఏలో పెట్టకూడదా? 173లో కాదు, 172 ప్రభుత్వ భూమిలో పెట్టామని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నంబర్‌లో రెండు ఎకరాలను భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదానం చేసిన రెండు ఎకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడడంతో మొత్తం 22 ఎకరాలను పీఓబీలో పెట్టడం జరిగిందన్నారు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి, వాస్తవ హక్కుదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్లు చూపిస్తూ ఒక నకిలీ మెమోను, మరోచోట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించి రిజిస్ట్రేషన్ కోరిన వ్యవహారాలను గుర్తించామని చెప్పారు. సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
యుఎల్‌సీ భూములపై త్వరలో నిర్ణయం..
రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యుఎల్‌సి) కి సంబంధించి కొద్దిరోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. సీఎస్-7, సీఎస్-14కు సంబంధించి 2017లో అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన దిన పత్రిక ఎం.డీ ఒక భూస్వామి నుంచి ఎస్ క్లాస్ బెంజి కారు తీసుకొని 5 డాక్యుమెంట్ల ద్వారా 811 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం కోరితే సెట్ దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో యుఎల్‌సి అనుమతులకు సంబంధించిన సమస్యలను మంత్రి వివరించారు. అనుమతులు తీసుకున్న వారికి ఇబ్బంది లేదని, అవసరమైన పత్రాలు అందిస్తే ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుందన్నారు. 22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోలేకపోయిన వారికి ఈ వారాంతంలోపు ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.