విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వివాదంలో మంత్రి కొండా సురేఖపైన, అలాగే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై విమర్శలు చేసిన సీనియర్ నేత ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ టీపీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్ కు నివేదిక సమర్పించింది. చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మొహన్ నివేదిక సమర్పించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించి నివేదికలో కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది.
నివేదిక అంశాలపై కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా జి.చిన్నారెడ్డిని తొలగించాలని నివేదికలో స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. నివేదికపై ఏఐసీసీ ఏం చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ , కేసీ వేణుగోపాల్ ల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు.
వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యం అని, పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలను ఉపేక్షించవద్దు అని, గతంలో హెచ్చరించినా కొండా సురేఖ వైఖరిలో మార్పు రాలేదు అని మల్లు రవి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. గతంలో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ఇద్దరిపై చర్యలు తీసుకోకుంటే పార్టీకి ఇబ్బంది అని, కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది కీలకమైన అంశం అని, నేతలు క్రమశిక్షణతో ఉంటేనే అందరికీ గౌరవం అని మల్లు రవి స్పష్టం చేశారు. అలాగే కొండా సురేఖపై పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కూడా నివేదిక ఇచ్చామని వెల్లడించారు.