• Telugu News
  • /Telangana

పొంగులేటి అక్రమాలపై బహిరంగ చర్చకు ఏలేటి సవాల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్రమాలపై తన వద్ద ఆధారాలున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు సవాల్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 19, 2026, 3:41 pm IST
Read Time: 6 mins
పొంగులేటి అక్రమాలపై బహిరంగ చర్చకు ఏలేటి సవాల్

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని, రేపు(గురువారం) 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. ఫినిక్స్, రాఘవ కన్ స్ట్రక్చన్ ల మధ్య జరిగిన రూ. 15వేల కోట్ల లావాదేవీలకు సంబంధించి, 102 షెల్ కంపెనీలకు సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని సాక్ష్యాధారాలను ఈడీ, సీబీఐలకు అప్పగిస్తానని, అలాగే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై ఆధారాలతో సహా రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానని, ఇందులో ఆయన భాగస్వామ్యం లేకపోతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నానాక్ రామ్ గూడ, శేరిలింగంపల్లిలో 14ఎకరాల నుంచి 7ఎకరాలను ఇండస్ట్రీయల్ జోన్ నుంచి డీ నోటిఫై చేసి..రెసిడెన్షియల్ జోన్ గా మార్చి..ఆ తర్వాత తన కంపెనీకి మార్పిడి చేసుకుని పొంగులేటి దోపిడికి పాల్పడ్డారని ఏలేటి ఆరోపించారు. ఫైనాన్షియల్ సిటీలో, కోకాపేట, హైటెక్ సిటీ, ఉప్పలగూడ సహా పలు ప్రాంతాలలో ఫినిక్స్ సహా పలు కంపెనీల నుంచి, టీజీఐఐసీ నుంచి రాఘవ కంపెనీకి బదిలీయైన వివరాలను ఏలేటి బయటపెట్టారు. వాటి ఆధారాలు నా వద్ద ఉన్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ బినామీగా ఉన్న ఫినిక్స్ కంపెనీతో రాఘవ కంపెనీ లావాదేవీల వివరాలు అన్ని బయటపెడుతానన్నారు. ఫినిక్స్ కంపెనీ లావాదేవిలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తానని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తులు, భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను కమీషన్ల కోసం పీడిస్తున్న వ్యవహరంపై పొరపాటు జరిగిందని చెప్పి మంత్రి పొంగులేటి తప్పించుకోలేరన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తను మూడు నెలల క్రితమే యాదగిరి గుట్ట మండలంలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారని సీఎం రేవంత్ కు చెప్పడం జరిగిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని చెప్పారని..అలాగైతే దీనిపై ఈడీ, సీబీఐ విచారణను ప్రభుత్వం కోరాలని ఏలేటి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 22ఏలో ఉన్న భూముల వివరాలు, కాంగ్రెస్ హయాంలో 22ఏలో ఉన్న భూముల వివరాలపై ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటిచాలని ఏలేటి డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి భూ అక్రమాలపైన, కంపెనీల అక్రమాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పొంగులేటి కంపెనీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంచనాలు పెంచి మరో దోపిడికి పాల్పడిందని ఏలేటి ఆరోపించారు. ధరణిని భూ భారతీగా మార్చి లక్షల కోట్ల భూ దోపిడికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని, ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైన అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. పొంగులేటి మంత్రి కాకముందు..అయిన తర్వాతా ఆయన ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరుపాలని నేను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని ఏలేటి ప్రకటించారు.