హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమల్లో ఉండగా, గృహజ్యోతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ రెండింటి అమలుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
అయితే గృహజ్యోతి పథకం హైదరాబాద్ నగరంలో మొదటగా 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 11 లక్షల మంది వివరాలన్నీ సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)కు చేరాయి. మార్చి నెలలో వీరికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానున్నట్లు సమాచారం.
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటి వరకు 30 లక్షల వినియోగదారుల వివరాలను పరిశీలన పూర్తి చేసి పథకం అమలు కోసం సీజీజీకి సమర్పించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వినియోగదారులు 11 లక్షల వరకు ఉన్నారు. ఆహార భద్రత కార్డు తప్పనిసరి చేయడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను బట్టి వీరి శాతం తగ్గొచ్చు.. లేదంటే పెరగొచ్చు.
గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికంగా హబ్సిగూడ సర్కిల్ పరిధిలో ఉన్నారు. ఇక్కడ 1.62 లక్షల మంది ఇండ్లకు ఉచిత విద్యుత్ వర్తించే అవకాశం ఉంది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో 1.59 లక్షలు, సరూర్‌నగర్ సర్కిల్‌లో 1.47 లక్షలు, హైదరాబాద్ సౌత్‌లో 1.27 లక్షల వినియోగదారుల పరిశీలన పూర్తయింది. బంజారాహిల్స్ సర్కిల్‌లో 59 వేల వినియోగదారులు గృహజ్యోతి కోసం వివరాలు ఇవ్వగా, మిగతా సర్కిళ్లలో లక్ష లోపే ఉన్నారు.