Site icon vidhaatha

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ఎప్పటినుంచి అంటే?

Half-day schools : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలలో ఎల్లుండి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయని విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదవ తరగతి పరీక్షలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 12:30నుండి మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఒంటి పూట బడుల నిర్వహణను ముందుకు తెచ్చింది. గతంలో ఏప్రిల్ నెలలోనే ఒంటిపూట బడుల అమలు నిర్ణయించేవారు. కానీ, ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా వేసవి కాలంలో మధ్యాహ్న వేళల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై పడే అవకాశం ఉంది. విద్యార్థుల దైనందిన ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఒంటి పూట బడులను నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువ. అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎండదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా ఒంటిపూట బడుల అమలుపై నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది.

Exit mobile version