Half Day Schools In Telangana | తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఈ నెల నవంబర్ 6న ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం ఎండాకాలం నేపథ్యంలో మార్చిలో ఒంటిపూట బడులు నిర్వహిస్తూ వస్తుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాదు కదా.. ఎందుకు ఒంటిపూట బడులు అని ఆలోచిస్తున్నారా? ఒంటిపూట బడుల వెనుక ఓ కారణం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 6న కులగణన మొదలవనున్నది. ఈ సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో పాటు 3,414 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 8వేల మంది సిబ్బందిని సైతం కులగణనలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసింది. ఆయా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉపాధ్యాయులు స్కూల్స్‌లో పాఠాలు బోధించాల్సి ఉంది.
ఆ తర్వాత కులగణన కోసం ఇంటింటికీ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, 150 ఇండ్లకో ఓ పర్యవేణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే 50 ప్రశ్నలతో డేటాను సేకరించనున్నారు. సర్వే కోసం ప్రత్యేకంగా కిట్లను సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా.. కులగణనపై ఈ నెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. కులగణన సకలజనుల సర్వేలా ఉండొద్దని.. సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడుతామన్నారు. అయితే, ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.. అందుకే నామ్‌కేవాస్త్‌గా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందంటూ విమర్శించారు. మరోవైపు విపక్షాలు, కులసంఘాల విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం సర్వే కోసం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 30లోగా సర్వే పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించింది.