Site icon vidhaatha

గాజా ప్రజలకు ఊరట.. కాల్పుల విరమణ పొడిగింపు

యుద్ధంలో అల్లకల్లోలమవుతున్న గాజా ప్రజలకు భారీ ఊరట లభించింది. కాల్పుల విరమణ కాలపరిమితిని పొడిగించాలని ఇజ్రాయెల్‌, హమాస్‌ ఒప్పందానికి వచ్చాయి. ఈ సమయంలో మరింత మంది పాలస్తీనా ఖైదీలతో ఇజ్రాయెల్‌ బందీల మార్పిడికి వీలు చిక్కినట్టయింది. మరికొద్ది నిమిషాల్లో కాల్పుల విరమణ ముగియనున్న నేపథ్యంలో తాము విడుదల చేయబోయే ఇజ్రాయెల్‌ బందీల పేర్లతో తాజా జాబితా వెలువరించింది. ఇందులో మహిళలు, చిన్నారులు అనేక మంది ఉన్నారు.


ఈ పరిణామానికి ముందు రోజు రాత్రి సమావేశమైన ఇజ్రాయెల్‌ యుద్ధ క్యాబినెట్‌.. హమాస్‌ తాను విడుదల చేయబోయే బందీల తాజా జాబితాను ప్రకటించకపోతే.. కాల్పుల విరమణ గడువు తీరగానే వెంటనే ఆపరేషన్‌ ప్రారంభించాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చింది. మరో రోజు కాల్పుల విరమణ పొడిగించిన విషయాన్ని అమెరికా, ఈజిప్ట్‌తో కలిసి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌ ధ్రువీకరించింది. తాజా ఒప్పందం నేపథ్యంలో గాజాలో ఎటువంటి మిలిటరీ కార్యకలాపాలు ఉండవు. అదే సమయంలో మానవతా సహాయాన్ని గాజాకు అందించేందుకు ఇజ్రాయెల్‌ ఆటంకాలు ఏర్పర్చదు.


మొదట నాలుగు రోజుల కాల్పుల విరమణ అనంతరం మరో రెండు రోజులపాటు సీజ్‌ఫైర్‌ కొనసాగుతుంది. బుధవారం రాత్రి వరకూ హమాస్‌ మొత్తం 102 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్‌ తన దేశంలోని జైళ్లలో ఉన్న 210 మంది ఖైదీలను విడుదల చేసింది. కాల్పుల విరమణ నేపథ్యంలో వందలాది ట్రక్కులు ఆహారం, ఔషధాలు, ఇంధనం, ఇతర సహాయ సామగ్రితో గాజాలోకి ప్రవేశించాయి. ఇదెలా ఉన్నప్పటికీ.. గడువు తీరగానే తాము మళ్లీ గాజాపై విరుచుకుపడతామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది.

Exit mobile version