Donald Trump Big Warning to Hamas | గాజా శాంతి ప్రణాళికకు త్వరగా హమాస్ అంగీకరించకపోయినా, స్పందించకపోయినా ‘తీవ్ర విషాదాంతం’ తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గాజా యుద్ధాన్ని ముగింపునకు తెచ్చేందుకు తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మంగళవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. హమాస్ ఈ ప్రణాళికకు అంగీకరించని పక్షంలో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ‘అన్ని అరబ్ దేశాలు సంతకాలు చేశాయి. ముస్లిం దేశాలు సైతం సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్ పక్షాన అందరూ సంతకం చేశారు. మేం హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. హమాస్ ఏదో ఒకటి తేల్చుకోవాలి. కానిపక్షంలో అది తీవ్ర విషాదంతమే అవుతుంది’ అని ట్రంప్ వైట్‌హౌస్ వద్ద మీడియాకు చెప్పారు. ప్రతిపాదనపై హమాస్ మూడు లేదా నాలుగు రోజుల్లో స్పందించాలి. లేనిపక్షంలో ఇజ్రాయెల్ ఏం చేయాలో అది చేస్తుంది’ అని అన్నారు. ట్రంప్ శాంతి ప్రణాళికపై తాము తమ గ్రూపులో, ఇతర పాలస్తీనా ఫ్యాక్షన్‌లతో చర్చించి, తమ అధికారిక వైఖరిని ప్రకటిస్తామని హమాస్ మంగళవారం పేర్కొన్నది. హమాస్ లొంగిపోయి, ఆయుధాలను వదిలేయడం ద్వారా యుద్ధం ముగింపునకు వస్తుందని పేర్కొంటున్న ట్రంప్ ప్రణాళిక.. పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని అందించడంతోపాటు.. గాజా పునర్నిర్మాణంపైనా హామీ ఇచ్చింది. దీనిని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహూ స్వాగతించారు. ఇజ్రాయెల్‌తోపాటు ఫ్రాన్స్, కెనడా, ఇండియా, రష్యా తదితర దేశాలు ట్రంప్ శాంతి ప్రణాళికలను ఆమోదించాయి.
శాంతి ప్రణాళికలో ఏముంది?
ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా 20 సూత్రాల ప్రతిపాదనలను అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో గాజాలో మిలిటరీ ఆపరేషన్ల తక్షణ నిలిపివేత, బందీలందరి విడుదల, ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ తదితర అంశాలు ఉన్నాయి. హమాస్ ఆయుధాలు వదిలేయాలని, గాజాను ఏ రూపంలోనూ పరిపాలించకూడదని షరతు పెట్టారు. దీనితోపాటు ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న వందల మంది పాలస్తీనియన్లను వదిలిపెట్టే అంశం కూడా ఉంది. పాలస్తీనియన్లు ఆకలిదప్పులతో మలమల మాడిపోతున్న గాజా ప్రాంతంలోకి తక్షణమే పూర్తి స్థాయిలో సహాయాన్ని పంపిస్తారు.
ట్రంప్ ప్రతిపాదనల్లో భవిష్యత్ పాలస్తీనా దేశానికి ద్వారాలు తెరిచినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. పాలస్తీనా ఆవిర్భావానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
గాజాలో 2023 అక్టోబర్ నుంచి 66వేల మంది మృతి
గాజాపై 2023 అక్టోబర్ నుంచి వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 66వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్న పిల్లలే. ఇజ్రాయెల్‌పై హమాస్ క్షిపణుల వర్షం కురిపించడంతో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ గాజా యుద్ధం ప్రారంభమైంది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 250 మందిని హమాస్ మిలిటెంట్లు అపహరించారు.