Site icon vidhaatha

ఒక్క చాన్స్ ప్లీజ్.. పవన్ నోట కొత్త మాట!

విధాత: మొన్న విశాఖలో మోడీతో భేటీ తరువాత పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా.. రాష్ట్ర రాజకీయాల్లో తాను కీలక పాత్రలో ఉండాలని ఆశిస్తున్నారా.. ఇన్నాళ్లూ వేరే పార్టీ అంటే టీడీపీ గెలుపు కోసం తన ఇమేజీని ఫణంగా పెట్టిన పవన్ ఇప్పుడు తానే తురుపుముక్క కావాలనుకుంటున్నారా.. అందుకే మాట తీరు మారిందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఆదివారం గుంకలాం గ్రామంలోని జగనన్న లే అవుట్ ను సందర్శించిన పవన్ అక్కడ ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తానని కోరడం చర్చనీయాంశం అయింది. తనను నమ్మండి నా మీద విశ్వాసం ఉంచండి అంటూ పవన్ జనాన్ని కోరారు.

తనకు జనాల నుంచి మద్దతు ఉంటే గూండాలతో పోరాడుతానని అభ‌య‌మిచ్చారు. మొన్నామధ్య మోడీతో భేటీ తరువాత జరిగిన మొదటి బహిరంగ సభలో పవన్ తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానని కూడా చెప్పారు.

ఇన్నాళ్లూ ప్రతిపక్ష ఓటు చీలవద్దని చెబుతూ అన్యాపదేశంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చిన పవన్ ఇప్పుడు ఎనీ టైం సింగిల్ హ్యాండ్.. ఒక్క‌ ఛాన్స్ ప్లీజ్ అనడాన్ని చూస్తుంటే బోలెడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈయన అటు టీడీపీతోనూ, బీజేపీతోనూ కూడా వెళ్లకుండా పూర్తిగా సింగిల్‌గా బరిలో దిగుతారా అన్న సందేహాలు వస్తున్నాయి.

2019లో కూడా జగన్ ఒక్క చాన్స్ అంటూ ప్రజల్ని రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పవన్ కూడా ఇలాగే ఒక్క చాన్స్ అంటున్నారు. మరి మున్ముందు ఎటువైపు అడుగుల వేస్తారో చూడాలి. ఇక విజయనగరం సభకు, రోడ్ షోకు జనం అయితే భారీగానే వచ్చారు. ఎక్కడికక్కడ దండలు.. వినతిపత్రాలు అందజేస్తూ ప్రజలు భారీగానే స్వాగతం పలికారు.

Exit mobile version