వీరోచిత డబుల్ సెంచ‌రీతో ఓడిపోయే మ్యాచ్‌ని గెలిపించిన మ్యాక్స్‌వెల్..ఫిదా అయిన రాజ‌మౌళి

  • Publish Date - November 8, 2023 / 01:55 AM IST

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2023లో ఆఫ్ఘ‌నిస్తాన్ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం రోజు జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ఆఫ్ఘ‌న్‌.. ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని మ్యాక్సెవెల్(128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 నాటౌట్) వీరోచిత డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచ‌రీ న‌మోదు చేయ‌డంతో పాటు ర‌షీద్ ఖాన్ చివ‌ర‌లో బ్యాట్ ఝుళిపించ‌డంతో ఆఫ్ఘనిస్తాన్ మంచి స్కోర్‌ని సాధించింది.

ఇక లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా ఒకానొక ద‌శ‌లో ఓడిపోతుంద‌ని అంద‌రు భావించారు. కాని మ్యాక్సీ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి గెలుపొందింది. కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించడం విశేషం.ఆస్ట్రేలియా 91 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయిన స‌మయంలో మ్యాక్స్‌వెల్, క‌మ్మిన్స్ మంచి భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. న‌వీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్‌లో ట్రావిస్ హెడ్(0) డకౌట్ కాగా, డేవిడ్ వార్నర్(18), జోష్ ఇంగ్లీస్(0)లను ఒమార్జాయ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. రెహ్మత్ షా సూపర్ త్రోకు మార్నస్ లబుషేన్ రనౌటవ్వగా.. మార్కస్ స్టోయినీస్‌ను రషీద్ ఖాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.మిచెల్ స్టార్క్‌(3)ను కూడా ర‌షీద్ ఔట్ చేయ‌డంతో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే మ్యాక్స్‌వెల్ 33 ప‌రుగుల వ‌ద్ద ముజీబ్ అత‌ని సింపుల్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో ఆయ‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్ చేసి త‌న టీమ్‌ని గెలిపించాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతూనే భారీ షాట్లతో విరుచుకుపడ‌గా ప్ర‌పంచ‌ క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియాకి అద్భుతమైన విజయం ద‌క్కింది.మ్యాక్స్‌వెల్ అద్భుత‌మైన బ్యాటింగ్ గురించి ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం మాట్లాడుకుంటుంది. రాజ‌మౌళి స్పందిస్తూ..`మ్యాడ్‌ మాక్స్` అంటూ పోస్ట్ పెట్టారు. మ్యాక్స్ వెల్‌ పిచ్చెక్కించేలా ఆట ఆడాడని, తాను చూసిన ఇన్నింగ్స్ లో ఇదొక గొప్ప ఇన్నింగ్స్ అంటూ రాజ‌మౌళి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.  

Latest News