- మేం ఆశించిన ఫలితం రాలేదు
- కారణాలపై సమీక్షించుకుంటాం
- పుంజుకుని బలంగా ముందుకొస్తాం
- ప్రగతిభవన్‌లో మీడియాతో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత : ‘ఇవాళ మేం ఓడిపోయాం. కానీ, ప్రతి రోజూ ఇదే జరుగదు. ఇవాళ ఆదివారం.. ప్రతిరోజూ ఆదివారం కాదు. ఇది గుర్తించుకోవాలి. మేం మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాం’ అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి ఎంతో చేసిన ఎందుకు ఇలా అయిందో అర్థం కావడం లేదన్నారు. ఇటువంటి ఫలితం రావడంపై కారణాలను సమీక్షించుకుంటామని తెలిపారు. 119 స్థానాల్లో 39 సీట్లలో తమను గెలిపించిన ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆదేశించారని, ఆ పాత్రను సమర్థవంతంగా, బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు. ‘ప్రజలకు మాకు రెండుసార్లు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రజానీకానికి సర్వదా రుణపడి ఉంటాం. పది సంవత్సరాలు అవకాశం కల్పించారు. వేరే వాళ్లకు అవకాశం ఇచ్చారని తిట్టిపోయడం అనేది.. నిందించడం అనేది భావ్యం కాదు’ అని అన్నారు.
కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టం
‘ఇవాళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని మనసారా కోరుకుంటున్నాను. మా పార్టీ తరపున శుభాకాంక్షలు. నిర్మాణత్మకంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం. కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయం. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం’ అన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు. ‘ప్రతిపక్ష పాత్రలో ఉండి అలవోకగా ఇమిడిపోతాం. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తాం’ అని చెప్పారు.
కుంగిపోం
గెలవంగానే పొంగిపోవద్దు.. ఓడిపోగానే కుంగిపోవద్దని తమ నాయకుడు మాకు చెప్పారని, తాను కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అదే చెబుతున్నానని పేర్కొన్నారు. ‘ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారు.. దాన్ని మే గౌరవిస్తాం. నాకు కూడా మంత్రి పదవి లేదు. మీతో ఎక్కువ సేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని తెలుసుకొని మాట్లాడతాను’ అని చెప్పారు.