చెన్నూర్‌ రాజ‌కీయం మారుతున్న‌దా? సుమన్ పరిస్థితి ఏంటి?

సుమన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, ఈసారి ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా కొంతమంది ఉద్యమకారులు కాంగ్రెస్ కు అనుకూలంగా అప్పుడే ప్రచారం మొదలుపెట్టారని తెలుస్తోంది.

  • Publish Date - November 4, 2023 / 11:03 AM IST

సుమన్ ఓట‌మే టార్గెట్‌గా స‌మీక‌ర‌ణాలు!

కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో వివేక్‌?

ఉద్య‌మ‌కారుల మ‌ద్ద‌తూ ఆయ‌న‌కే

విధాత : చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఎదురుగాలి వీస్తున్న‌దా? తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఆయ‌న విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తాయా? కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతార‌ని తెలుస్తున్న వివేక్ ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్నారా? ప‌రిస్థితులను గ‌మ‌నిస్తే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తున్న‌ది. త‌న‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ అధిష్ఠానం స‌హ‌కారంలో సుమ‌న్ చ‌క్క‌దిద్దుకుంటూ వ‌చ్చారు. గత ఎన్నికల సమయంలోనే తనను కాదని బాల్క సుమన్‌కు చెన్నూర్‌ టికెట్‌ ఇవ్వడానికి నల్లా ఓదెలు, ఆయన అనుచరులు తీవ్రంగా నిరసించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు సుమన్‌పై ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రస్తుత పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ నేతకాని వెంకటేశ్‌. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయనను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి ఆయనకు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత నల్లాల ఓదెలు సతీమణికి జడ్పీ చైర్‌ప‌ర్స‌న్ ఇవ్వడంతో అధికారపార్టీ అభ్యర్థికి తిరుగులేకుండాపోయింది. అయితే.. తాజా ప‌రిణామాలు అన్నీ సుమ‌న్‌కు వ్య‌తిరేకంగానే క‌నిపిస్తున్నాయి.


సుమన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, ఈసారి ఆయన ఓడించడమే లక్ష్యంగా కొంతమంది ఉద్యమకారులు కూడా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా అప్పుడే ప్రచారం మొదలుపెట్టారని తెలుస్తోంది. వివేక్‌కు, వారి కుటుంబానికి ఆ నియోజకవర్గంతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే చెన్నూరు ఉన్నది. ఆయన తండ్రి వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. సీపీఐ కూడా ఆ నియోజకవర్గంలో బలంగానే ఉన్నది. కాంగ్రెస్‌, సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెంతో పాటు చెన్నూరు కూడా ఆ పార్టీకి టికెట్‌ కేటాయిస్తారని దీంతో తనకు విజయం సులభమని సుమన్‌ భావించారు. పైకి అక్కడ తన గెలుపు నల్లేరు నడకే అనుకున్నారు. కానీ మంత్రి కేటీఆర్‌ అక్కడ ప్రచారానికి వెళ్లి మీరు గెలిపిస్తే కేసీఆర్‌ ఆశ్వీర్వాదంతో సుమన్‌కు పెద్ద పదవి వస్తుందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సుమన్‌పై వ్యతిరేకత ఉన్నది కాబట్టే మంత్రి అలా అన్నారని ఆ నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకున్నారు. మ‌రోవైపు ఈసారి ఎలాగైనా చెన్నూరు బరిలో ఉండాలని నల్లాల ఓదెలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు టికెట్‌ సీపీకి కేటాయించవద్దని ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలోనే టికెట్ల కోసం నేతలు పోటీ పడటం, చాలా నియోజకవర్గాల్లో సొంతపార్టీలోనే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో వామక్షాలకు, జనసమితికి ఎన్నికల అనంతరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతో వామపక్షాల పొత్తు దాదాపు లేనట్టే అని అప్పుడే తేలిపోయింది.


సీపీఎం ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐ కూడా కాంగ్రెస్‌ నిర్ణయం కోసం చూస్తున్నా కొత్తగూడెం తప్పా చెన్నూరు టికెట్‌ ఆ పార్టీ ఇచ్చేపరిస్థితి లేదు. దీంతో ఒక్క స్థానం కోసం ఆ పార్టీ వద్ద మోకరిల్లడం దేనికి అనే అభిప్రాయం సీపీఐ నేతల్లో వచ్చింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని సమాచారం.


బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ తరఫున 2104లో పోటీ చేసిన వివేక్‌పై కేసీఆర్‌ సుమన్‌ను నిలబెట్టారు. ఆయన భారీ మెజారిటీ గెలిచారు. అప్పటి నుంచి సుమన్‌కు రిట‌ర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని వివేక్‌ చూస్తున్నారు. ఈసారి ఆ అవకాశం వచ్చిందని, కొంతమంది ఉద్యమకారులు కూడా వివేక్‌కు మద్దతు తెలుపడంతో చెన్నూరు నియోజకవర్గంపై ఆసక్తి నెలకొన్నది. పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.


వివేక్‌ కూడా టికెట్‌ ఖరారయ్యాక ప్రచారం ముగిసే వరకు అక్కడే ఉండాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారట. గతంలో మాదిరిగా ఏమరమాటు ఏ మాత్రం పనికిరాదని వివేక్‌కు మద్దతు ఇస్తున్న ఉద్యమకారులు కూడా సూచిస్తున్నారట. నిన్నమొన్నటివరకు గజ్వేల్‌, కామారెడ్డి , సిరిసిల్ల, సిద్దిపేట వంటి నియోజకవర్గాలపై మీడియాలో చర్చ జరిగింది. పెద్దగా వార్తల్లో లేని చెన్నూరు నియోజకవర్గం లో ఇప్పుడు గెలుపు ఎవరిది? అనే చర్చ మొదలు కావడం గమనార్హం.

Latest News