విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)సమావేశాలు ఈ నెల 30నుంచి జరుగనున్నట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram commission report) ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు నిర్వహించబోతుండటం రాజకీయ వర్గాల్లో(Telangana Politics) ఆసక్తికరంగా మారింది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం నిర్ణయించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్దం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ కి సంతాపం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, కాళేశ్వరం నివేదికపై చర్చ కొనసాగనుంది.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని ప్రకటించిన సంగతి విదితమే. ఇదే విషయాన్ని ఇటీవల కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు కోరుతు మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) లు హైకోర్టులో తాజాగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగానూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చల యుద్దానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు కత్తులు నూరుకుంటున్నాయి. నివేదికను అసెంబ్లీలో పెట్టాలని చీల్చి చెండాడుతామని హరీష్ రావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.