హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 14 కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు 10 వేల మంది బీమా ఏజెంట్లను నియమించాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే విజయవాడలో జోనల్ కార్యాలయం ఉండగా, హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. నగరంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, చాలా మందికి బీమా లేకపోవడం గమనార్హం. దాదాపు 45 శాతం మంది ఆసుపత్రి ఖర్చుల కోసం సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు గెలాక్సీ నేరుగా ప్రజలతో కలిసి పనిచేయడం, పంపిణీదారులతో భాగస్వామ్యం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టనుంది.
స్థానిక అవసరాలకు అనుగుణంగా బీమా పథకాలను రూపొందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఎండీ & సీఈఓ జి. శ్రీనివాసన్ తెలిపారు. గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన గెలాక్సీ ప్రామిస్ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఇది రూ. 3 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు బీమా మొత్తాన్ని అందిస్తోంది. దీంతోపాటు పలు ఇతర అనుబంధ పథకాలను కూడా అందుబాటులో ఉంచింది.