Samantha | పెళ్లి తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒకప్పుడు సాధారణంగా కనిపించేది. కాలక్రమంలో ఆ ఆచారం మారుతూ వచ్చింది. ఆధునిక కాలంలో కొంత మంది మహిళలు భర్త ఇంటి పేరును తమ పేరుకు జత చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ అసలు పేరునే కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఇష్టం. అయితే ఇప్పుడు ఇదే అంశం చుట్టూ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ‘అక్కినేని’గా మారిన సమంత
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత సమంత తన పేరు చివర ‘అక్కినేని’ ని జోడించారు. ఆ సమయంలో కొన్ని సినిమాల టైటిల్ కార్డుల్లో ఆమె పేరు ‘సమంత అక్కినేని’ గా కనిపించింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా తన పేరును అదే విధంగా మార్చుకున్నారు. అప్పట్లో ఇది పెద్దగా చర్చకు రాకపోయినా, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ గుర్తింపుగా నిలిచింది.
విడాకుల ముందు ‘అక్కినేని’ తొలగింపు
నాగ చైతన్యతో విడాకులు తీసుకునే నిర్ణయం తీసుకున్న తర్వాత, అధికారిక ప్రకటనకు కొద్దిరోజుల ముందే సమంత తన పేరు చివర ఉన్న ‘అక్కినేని’ ని తొలగించారు. దీంతో అప్పుడే బ్రేకప్ వార్తలు బయటికొచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత ఆమె తన అసలు పేరైన ‘సమంత రూత్ ప్రభు’ ను పూర్తిగా తిరిగి ఉపయోగించడం ప్రారంభించారు.
రాజ్ నిడిమోరుతో పెళ్లి… ఇప్పుడు కొత్త సందేహం
డిసెంబర్ 2025లో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో గానీ, పబ్లిక్ ప్రొఫైల్స్‌లో గానీ తన పేరును మార్చుకోలేదు. దీంతో మరోసారి ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది… ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ చర్చకు మరింత ఊపునిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్‌గా, నిర్మాతలలో ఒకరిగా ఆమె భర్త రాజ్ నిడిమోరు ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ కార్డుల్లో సమంత పేరు ఎలా పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
‘సమంత’నా? ‘సమంత నిడిమోరు’నా?
సినిమా టైటిల్ కార్డులో ఆమె పేరు కేవలం ‘సమంత’ గా పడుతుందా? లేక ‘సమంత నిడిమోరు’ గా కనిపిస్తుందా? అనే విషయంలో అభిమానుల్లో చర్చ నడుస్తోంది. గత అనుభవాలను చూసుకుంటే సమంత తన వ్యక్తిగత నిర్ణయాల విషయంలో చాలా స్పష్టంగా ఉంటారని అభిమానులు అంటున్నారు. పేరు మార్చుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమే.
