Site icon vidhaatha

వినియోగదారులకు షాక్‌ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..! రుణాలు ఇక మరింత భారం..!

విధాత‌: వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ షాక్‌ ఇచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్స్‌ (MCLR)ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దాదాపు పది బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో వినియోగదారుల ఈఎంఐలపై మరింత భారం పెరిగే అవకాశం ఉన్నది. ఏదైనా లోన్​కు బ్యాంక్​ వసులు చేసే కనీస వడ్డీ రేటు ఈ ఎంసీఎల్​ఆర్​. కనిష్ఠ వడ్డీ రేటు పెరిగితే.. వినియోగదారులపై భారపడే అవకాశం ఉంటుంది. ఏదేని బ్యాంక్‌ ఆర్‌బీఐ రెపోరేటు లేదంటే ట్రెజరీ బిల్‌ ఈల్డ్‌కు తగ్గట్టుగానే వడ్డీరేట్లను ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది. 2019 అక్టోబర్​ 1 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది.

ఇటీవల ఆర్‌బీఐ ఎంపీసీ (మానిటరి పాలసీ కమిటీ) భేటీలో రెపో రేట్లను మార్చకూడదని ఆర్​బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫలితంగా వరుసగా నాలుగోసారి రేపోరేటు 6.5శాతంగానే ఉన్నది. ఈ క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీలో ఎంసీఎల్​ఆర్​ ఓవర్​నైట్​ (ఒకరోజుకు) 8.60శాతం ఉండబోనున్నది. నెలకు 8.65శాతం, మూడు నెలలకు 8.85శాతం, ఆరు నెలలకుగాను 9.10శాతం, ఏడాదికి 9.20శాతం, రెండేళ్లకాలానికి 9.20శాతం, మూడేళ్ల కాలానికి 9.25శాతం ఉండనున్నది.

అయితే, హోంలోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌ ఏదైనా తీసుకోవాలనుకుంటే.. టెన్యూర్‌ను బట్టి ఈ వడ్డీ రేట్లు ఉండనున్నాయి. మరో వైపు ఎంపిక చేసిన టెన్యూర్‌లపై ఎఫ్‌డీలను హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవల తగ్గించింది. ఫలితంగా వారం నుంచి పదేళ్ల కాలవ్యవధి మధ్య ఉన్న ఎఫ్‌డీలపై 3శాతం నుంచి 7.20శాతం వరకు వడ్డీ లభించనున్నది. సీనియర్‌ సిటిజన్లకు 3.5శాతం నుంచి 7.75శాతం వరకు ఉండనున్నది. అయితే, నిబంధనలు ఈ అక్టోబర్‌ ఒకటి నుంచి అమలులోకి హెచ్‌డీఎఫ్‌సీ అమలులోకి తీసుకువచ్చింది.

Exit mobile version