నటీనటులు : మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, బ్రహ్మానందం, కౌశల్ మంద, మధుబాల, శరత్ కుమార్ తదితరులు
దర్శకుడు : ముఖేష్ కుమార్ సింగ్
నిర్మాతలు : మోహన్ బాబు
సంగీతం : స్టీఫెన్ డావెస్సి
సినిమాటోగ్రఫీ : షెల్డన్ చౌ
ఎడిటర్ : ఆంథోని
Kannappa Review | మంచు విష్ణు కలల ప్రాజెక్ట్గా ఎంతోకాలంగా ఎదురుచూసిన ‘కన్నప్ప’ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల సన్నాహకాలు, సంసిద్ధత తరువాత తెరపైకి వచ్చిన ఈ సినిమా భక్తి, కల్పిత, వీరత్వం, భావోద్వేగాల మేళవింపుతో సాగుతుంది. 1976లో కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప అందించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఈ సినిమా మరో తరానికి పరిచయం చేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.మంచు కుటుంబం పట్ల నెగటివ్ పబ్లిసిటీ కొంత వ్యతిరేకత తీసుకొచ్చినప్పటికీ, టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచగలిగారు.
ఈసారి కథను కేవలం భక్తికథలా కాకుండా, ఒక సామాన్య వ్యక్తి – నాస్తికుడు – మానవతా విలువలతో కూడిన మార్గంలో శివుడి భక్తుడిగా మారే మార్గాన్ని చూపిస్తూ, ఈ తరానికి అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. అదే ఈ సినిమాకి ప్రత్యేకతను అందించింది.
కథ – నమ్మకాన్ని బలంగా మార్చిన కథనం
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి శరత్ కుమార్ పెంపకంలో పెరిగిన తిన్నడు (మంచు విష్ణు) జీవితంలోని ఒక ఘోర సంఘటనతో దేవుడిపై అసహ్యంతో, విరక్తితో నాస్తికుడిగా ఎదుగుతాడు. అతని చిన్ననాటి స్నేహితుడిని దేవత బలి తీసుకున్న సందర్భం అతనిలోని దేవతలపై ఉన్న ఆ కాస్తా భక్తినీ ఆహుతి చేసింది.
తిన్నడు తన స్వగ్రామాన్ని రక్షించేందుకు అన్నీ తానై నిలబడతాడు. కానీ గ్రామ సంప్రదాయాలపై తిరుగుబాటు చేయడం వల్ల గ్రామ బహిష్కరణకు గురవుతాడు. నెమలి (ప్రీతి ముకుందన్) అతని వెంట ప్రేమతో వస్తుంది. ఈ ప్రేమ – ఈ ప్రయాణం – ఈ బాధ – అతనిని శివుని దరికి ఎలా తీసుకెళ్లింది? ఈ మార్పుకు కారణమైన రుద్రుడెవరు? అతని పాత్రలో ప్రభాస్ ఎలా మెరిపించాడు? ఇదంతా తెరపై ఆవిష్కరించిన తీరు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
వాయులింగాన్ని కాపాడే బ్రాహ్మణుడిగా మహదేవశాస్త్రి పాత్రలో మోహన్ బాబు, అతని గంభీరత, భక్తి భావన చిత్రానికి కొంత తోడుగా నిలిచింది. దైవాన్ని కేవలం తన వర్గానికి మాత్రమే పరిమితం చేయాలనుకునే వ్యక్తిగా అతను కనిపించినా, ఆ పాత్రనూ సానుభూతితో చూపడం దర్శకుని విజ్ఞత.
నాటకీయత, శివతత్వం, భావోద్వేగాల సమ్మేళనం
కథలో తిన్నడు నెమ్మదిగా మారిపోతూ ఉండగా, సినిమాకు అసలైన మలుపు తీసుకుందీ అంటే అది రుద్రుడి పాత్రలో ప్రభాస్ ప్రవేశించిన తరువాతే. ప్రభాస్ మాటల్లోనూ, రూపంలోనూ ఉన్న ఆత్మీయత, గంభీరత తిన్నడిని తత్వమార్గంలోకి నడిపిస్తుంది. ముఖ్యంగా ఆయన చెప్పే “నీవు శివుణ్ణి ఎందుకు చూడలేవో తెలుసా? ఎందుకంటే నీవు నిన్ను ఇంకా పూర్తిగా కోల్పోలేదు…” అన్న డైలాగ్ రోమాంచితంగా ఉంది.
ఈ సన్నివేశాల నుండి సినిమా ప్రయాణం ఒక సాంప్రదాయ భక్తికథను దాటి, ఆధ్యాత్మిక మార్గంలో ఆవిష్కృతమయ్యే జీవన తత్వాన్ని చెబుతుంది. తండ్రి మరణం, నెమలి నుండి విరహం, వాయులింగాన్ని కాపాడేందుకు తిన్నడు చేసే త్యాగం – అన్నీ కలిపి సినిమాను భావోద్వేగాల మేళవింపుగా మార్చేసాయి.
కన్నప్ప కళ్లు త్యాగం చేసే సన్నివేశం, నేపథ్య సంగీతంతో గుండెను మెలిపెట్టే భావోద్వేగానికి గురిచేసింది. ఇదే సినిమాలో గొప్ప సన్నివేశం. క్లైమాక్స్‌లో మంచు విష్ణు పూర్తి స్థాయిలో శివభక్తుడిగా జీవించాడు.
నటీనటుల ప్రదర్శన
- మంచు విష్ణు(Manchu Vishnu): తిన్నడుగా, నాస్తికుడిగా, సాహసికుడిగా కనిపించి, భక్తుడిగా మారిన తరువాత ఎమోషనల్‌గా నటించిన తీరు అభినందనీయం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు ప్రాణం.
- ప్రభాస్(Prabhas): స్క్రీన్‌పై అతని రాక సినిమాకే లైఫ్ ఇచ్చింది. అతను మాట్లాడిన ప్రతి మాట శివతత్వాన్ని ప్రతిబింబించింది. హుందాతనంతో కూడిన పవిత్రత ఆయన పాత్రలో కనిపిస్తుంది.
- మోహన్ బాబు(Mohan Babu): బ్రాహ్మణుడిగా పాత్రలో గంభీరతను నిలబెట్టారు. చివర్లో తిన్నడికి మార్గదర్శిగా మారడం లోతైన సందేశాన్ని అందించింది.
- మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ (Mohan Lal, Akshay Kumar, Kajal Agarwal)– అతిథి పాత్రలుగా కనిపించినా, వారి పాత్రల్లోనూ గొప్ప గౌరవం, ప్రాధాన్యత కనిపించింది.
- ప్రీతి ముకుందన్(Preeti Mukundan): గ్లామర్‌తో ఆకట్టుకుంది. కానీ పాత్ర అంతగా మెచ్చుకునే స్థాయిలో లేదు.
సాంకేతిక పరంగా..
షెల్డన్ చౌ(Sheldon Chau) ఛాయాగ్రహణ అద్భుతం. న్యూజిలాండ్ లొకేషన్లు సినిమాను విజువల్‌గా గ్రాండియర్‌గా మార్చాయి. స్టీఫెన్ డేవస్సీ(Stephen Devassy) సంగీతం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగించింది. ముఖ్యంగా నేపథ్యసంగీతం క్లైమాక్స్‌లో చక్కగా హత్తుకునేలా ఉంది. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా అనిపించినా, మొత్తం మీద విజువల్స్ ఆకర్షణీయంగా మారాయి.
ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh Singh) దర్శకత్వంలో గాఢత కనిపించింది. పురాణాల టీవీ సీరియల్ అనుభవం సినిమాకి పనికొచ్చింది. కానీ, కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ పేరుతో అసలైన కథనంలో కాల్పనికత కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా బ్రాహ్మణ పాత్రలో ఉన్న అంతర్లీన తత్వవాదం కొందరికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు.
బలాలు(Pros):
- మంచు విష్ణు పర్ఫార్మెన్స్, ప్రత్యేకంగా క్లైమాక్స్‌లో
- ప్రభాస్ పాత్ర తత్వభరితంగా ఉండడం
- శివపార్వతుల పాత్రలు ఆధ్యాత్మికతను బలోపేతం చేయడం
- భావోద్వేగంతో కూడిన ద్వితీయార్థం
బలహీనతలు(Cons):
- మొదటి భాగం నెమ్మదిగా సాగడం
- రొమాంటిక్ ట్రాక్ డైవర్షన్‌గా అనిపించడం
- గ్రాఫిక్స్ లోపాలు కొన్నిచోట్ల కనిపించడం మైనస్
- కథలో కల్పన ఎక్కువగా ఉండడంతో అసలైన భక్త కన్నప్ప కథ నుంచి కొంత దూరమైంది.
తీర్పు(Vidhatha Verdict):
‘కన్నప్ప’ సినిమా నిజంగా ఒక ప్రయోగాత్మక, భావోద్వేగ భక్తిరస చిత్రం. మనిషి తనలోని కోపాన్ని, నిరాశను ఓర్పుగా మార్చుకుని దేవుని అశ్రితుడిగా మారిన కథ. చివరి అరగంటలో ఉన్న గాఢత, ఆత్మాన్వేషణ, దైవికత సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. ఆద్యంతం అలాగే ఉంటే ఇది మరపురాని భక్తిరస చిత్రంగా చరిత్రలో మిగిలిపోయేది.
రేటింగ్: 3½ / 5