కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు, రెండున్నరేండ్ల వయసున్న మరో బాలుడు మృతి చెందారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన శిశువుల్లో ముగ్గురు ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జన్మించగా, మరో ఏడుగురు వివిధ ప్రాథమిక ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ అమిత్ దాన్ తెలిపారు. ఒక వేళ చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యమని తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.
24 గంటల వ్యవధిలో 10 మంది చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల్లో అధికంగా పోషాకాహారం లోపం వల్ల చనిపోయినట్లు తేలిందన్నారు. కొందరు శిశువులు తక్కువ బరువుతో జన్మించడం కూడా కారణమన్నారు. రెండున్నరేండ్ల బాలుడు నరాల రుగ్మతతో బాధపడుతూ మరణించినట్లు తెలిపారు. ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ 65 పడకల సామర్థ్యంతో ఉందని, ప్రస్తుతం అక్కడ 150 మంది చిన్నారులకు చికిత్స కొనసాగుతోందని అమిత్ దాన్ పేర్కొన్నారు.