ఐదేండ్ల బాలిక‌పై 60 ఏండ్ల వృద్ధుడు అత్యాచారం.. ఆపై ఆత్మ‌హ‌త్య‌

అన్నెం పున్నెం ఎరుగ‌ని ఓ ఐదేండ్ల బాలిక‌పై 60 ఏండ్ల వృద్ధుడు క‌న్నేశాడు. కామంతో ఆ చిన్నారిపై క్రూర మృగంలా విరుచుకుప‌డ్డాడు. అనంత‌రం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌రేలి జిల్లాలో వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌రేలి జిల్లా ఫ‌రీద్‌పూర్ పోలీసు స్టేష‌న్‌లోని ఓ గ్రామానికి చెందిన షేర్ మ‌హ్మ‌ద్(60).. ఐదేండ్ల బాలిక‌పై క‌న్నేశాడు. ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ చిన్నారిని షేర్ మ‌హ్మ‌ద్ మాయ‌మాట‌లు చెప్పి త‌న ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంత‌రం చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక ఎంత‌సేప‌టికి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. ఆమె త‌ల్లిదండ్రులు వెత‌క‌డం ప్రారంభించారు.



షేర్ మ‌హ్మ‌ద్ ఇంట్లో చిన్నారిని గ‌మ‌నించారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాలిక‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కుటుంబ స‌భ్యులు. షేర్ మ‌హ్మ‌ద్ అక్క‌డ్నుంచి త‌ప్పించుకుని పారిపోయాడు. స‌మీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.


బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వృద్ధుడి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.