విధాత: ఓ యువకుడు అమ్మమ్మ ఇంటికి కన్నం వేశాడు. దోస్తులతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. ఒంటరిగా ఇంట్లో ఉండే వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు, నగలతో ఉడాయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా భీమ్‌గంజ్ ప్రాంతంలో వృద్ధురాలు బాను మన్సూరి నివాసం ఉంటున్నది. బుధవారం నలుగురు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. వృద్ధురాలు అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో బట్టలు కుక్కారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలతో దొంగలు పారిపోయారు. దొంగలు ఇంట్లోకి వచ్చిన, బయటకు వెళ్లిన దృశ్యాలు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
చోరీపై వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మహ్మద్ అఫ్తాబ్, సూరజ్ సాల్వి, ఆదిల్ ఖాన్, మహ్మద్ రియాజ్‌ను అరెస్టు చేశారు. వృద్ధురాలి మనుమడు అఫ్తాబ్ తన స్నేహితులతో కలిసి ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సొత్తును స్వాధీనం చేసుకున్నారు.