- సికింద్రాబాద్ మేధా స్కూల్లో మాదకద్రవ్యాల తయారీ
- ఆల్ప్రాజోలామ్ తయారీ గుట్టు రట్టు
- పాఠశాల డైరెక్టరే సూత్రధారి
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత):
School Turns Drug Factory | పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలనే రాత్రిళ్లు మత్తు మందుల తయారీ కేంద్రంగా మార్చిన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి లోని మేధా హై స్కూల్‌లో అల్ప్రాజోలామ్ (Alprazolam) తయారీ కేంద్రం నడుస్తోందని సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసుల ఈగిల్ (EAGLE –Elite Action Group for Drug Law Enforcement) బృందం దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేసింది. ఇందులో స్కూల్ డైరెక్టర్/కరస్పాండెంట్ మల్లెల జయప్రకాశ్ గౌడ్ కూడా ఉన్నారు.
ఆరు రోజులు డ్రగ్స్ తయారీ, ఆదివారం పంపిణీ
పోలీసుల కథనం ప్రకారం, పాఠశాల భవనంలో కింది, మొదటి అంతస్థుల్లో తరగతులు నడుస్తుండగా, రెండో అంతస్తును గోప్యంగా ల్యాబ్‌గా మార్చి రాత్రిళ్లు కెమికల్ రియాక్టర్ల సాయంతో ఆల్ప్రాజోలామ్ తయారు చేస్తున్నారు. ఘటనాస్థలిలో ఎనిమిది రియాక్టర్లు, డ్రైయర్లు, ముడి రసాయనాలు వంటివి పెద్ద మొత్తంలో లభించాయి. ఈ ఫ్యాక్టరీ గత ఆరు నెలలుగా నడుస్తోందని, ఆరు రోజులు ఉత్పత్తి చేసి, ఆదివారాల్లో పంపిణీ చేసేవారని పోలీసులు భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం, తయారుచేసిన మత్తుమందును వినియోగదారులకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తుండగా, ఈగల్ టీమ్ దాడి చేసి జయప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుండి దాదాపు 3.5 కిలోల ఆల్ప్రాజోలామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్కూల్‌లో గాలింపు చేపట్టి, తయారీలో ఉన్న 4.3 కిలోలు, మొత్తంగా 7 కిలోలకు పైగా, అలాగే రూ.20–21 లక్షల నగదు, పెద్ద మొత్తంలో ముడి రసాయనాలు, తయారీ పరికరాలు జప్తు చేసినట్లు ఈగిల్ అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌కు సహకరించిన గౌటె మురళీ సాయి, పెంటమోల్ ఉదయ్ సాయిలను కూడా అరెస్టు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కల్లు డిపోలకు సరఫరా
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, జయప్రకాశ్ గౌడ్ ఆల్ప్రాజోలామ్ తయారీ ప్రక్రియను గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి నేర్చుకున్నట్లు చెబుతున్నాడు. తయారుచేసిన మత్తు పదార్థాన్ని ప్రధానంగా మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లోని కల్లు డిపోలకు సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. పాఠశాల సిబ్బందికి అనుమానం రాకుండా ఉండడానికి, తరగతుల సమయంలో సంబంధిత గదులకు తాళం వేయడం, రాత్రిళ్లు మాత్రమే కెమికల్స్ తరలించడం వంటి పద్ధతులు అనుసరించినట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇతర రాష్ట్రాలకు సరఫరాలు జరిగాయా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
దేవాలయం లాంటి పాఠశాలను డ్రగ్స్ ఫ్యాక్టరీగా మారుస్తూ పిల్లల భద్రతను పణంగా పెట్టిన ఈ ఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు పంపిన పోలీసులు, ఈ మొత్తం నెట్‌వర్క్ మూలాలను వెలికి తీసేందుకు సిద్ధమవుతున్నారు.