- మోదీ ప్రధాని అయిన తర్వాత 12 ఏళ్లలో 9.87 లక్షల కోట్ల రుణాల మాఫీ
- రైతులకు చేసిన మాఫీ కేవలం రూ.1.67 లక్షల కోట్లే
- సామాన్యులకు బ్యాంకు సేవలు, యుపీఐ సర్వీసులన్నీంటికి నిర్ణీత చార్జీలు
హైదరాబాద్, విధాత:
Loan Waivers | జనాన్ని దోచి.. కార్పొరేట్లను మేపడం అంటే ఇదే కావచ్చు.. పాలకులు, బ్యాంకులు కలిసి.. ప్రజల సంపదను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం అంటే ఇదే కావచ్చు!! రాజ్యసభలో పర్యావరణ వేత్త, ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ సి చేవాల్ అడిగిన ఒక ప్రశ్నకు మోదీ సర్కారు ఇచ్చిన సమాధానం యావత్ భారత ప్రజలను విస్మయానికి గురిచేసేలా ఉన్నది. దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.9.87 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు తెలిపింది. ఈ మొత్తంలో కార్పొరేట్ సంస్థల వాటా 85.5 శాతంగా పేర్కొన్నది. ప్రభుత్వం రాజ్యసభకు ఇచ్చిన గణాంకాల ప్రకారం మొత్తం కార్పొరేట్ సంస్థలకు రైటాఫ్ చేసిన రుణాల్లో (బ్యాంకు లెడ్జర్లలో ఆ రుణాన్ని తొలగిస్తారు) రూ.7.21 లక్షల కోట్లు పెద్ద పారిశ్రామిక సంస్థలవి ఉంటే.. రూ. 2.65 లక్షల కోట్లు వివిధ బ్యాంకింగ్ నిబంధనల కింద పెద్ద వ్యాపార సంస్థలకు ఇచ్చిన రుణాలని కేంద్రం రాజ్యసభకు తెలిపింది. అయితే రైతే రాజు.. రైతు సేవలో తామున్నామని ఉదరగొట్టుకునే కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పంటలు పండక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, దిగాలు పడిన రైతులకు చేసిన రుణమాఫీ రూ.1.67 లక్షల కోట్లు మాత్రమే. ఇది రుణమాఫీలో 14.5 శాతం మాత్రమే.
బ్యాంకులలో సామాన్య ప్రజలు, వేతన జీవులు, చిరు వ్యాపారులు దాచుకున్న సొమ్మునంతా కార్పొరేట్ సంస్థలకు ఇలా రుణాల పేరిట అప్పగించడం.. తర్వాత.. రుణాల రద్దు పేరిట చేతులు దులిసేపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఈ మేరకు జరిగే నష్టాన్ని సామాన్య ప్రజల నుంచి రకరకాల సేవల పేరుతో చిల్లర వసూళ్ల దందా చేస్తున్నాయని అంటున్నారు.
మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత పెద్ద నోట్ల రద్దును ప్రకటించడంతో మొత్తం సొమ్ము బ్యాంకుల్లోకి మళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డిజిటల్ మనీ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా లావాదేవీలన్నీ ఆన్‌లైనే అధికంగా చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారా అవుతున్నాయి. మొత్తంగా ఓపెన్ మార్కెట్‌లో గతం కంటే చాలా తక్కువ స్థాయిలోనే నగదు చలామణీ అవుతున్నది. ఇక్కడే కార్పొరేట్ దోపిడీకి తెర లేచిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అనేక బ్యాంకుల నుంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేశాయి. వాటిని ప్రభుత్వం ఆయా సందర్భాల్లో రైటాఫ్ చేస్తూ వస్తున్నది. ఇది సదరు బ్యాంకులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. వాటిని పూడ్చుకొనే క్రమంలో బ్యాంకులు సామాన్యులకు ఉచితంగా అందించాల్సిన అనేక బ్యాంకింగ్ సర్వీసులకు ముక్కు పిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నాయి.
గతంలో చెక్ పేమెంట్లకు, ఆర్టీజీఎస్‌కు బ్యాంకులు ఉచిత సేవలు అందించేవి. ఇప్పడవన్నీ పోయాయి. ప్రతి ట్రాన్జాక్షన్‌కు నిర్ణీత చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ సొమ్ముతో ఈ బ్యాంకులన్నీ తమ నష్టాలను పూడ్చుకుంటున్నాయని రిటైర్డ్ బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. డబ్బు విత్‌డ్రా చేసుకునే పక్షంలో ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలకు మించితే పదిశాతం టీడీఎస్ విధిస్తున్నారు. ఇతర బ్యాంకులకు neft, rtgs చేసిన పక్షంలో చార్జీలు విధిస్తున్నారు.
దేశంలోని అన్ని బ్యాంకులలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు 2024-2025 సంవత్సరంనాటికి రూ.67 వేల కోట్ల వరకు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన నివేదికలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం సేవింగ్, కరంట్ అకౌంట్ల ఖాతాలతో పాటు ఫిక్డ్స్ డిపాజిట్లు, FD (Fixed Deposit), రికరింగ్ డిపాజిట్లు–RD (Recurring Deposit) ఖాతాదారులు 10 ఏళ్లు వినియోగించకపోతే ఆ మొత్తాలను అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా (unclaimed deposits)గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India (RBI)) గుర్తిస్తుంది. ఇలా ఉన్న సొమ్ముతో పాటు, వివిధ సేవల ద్వారా వచ్చే సొమ్ముతో కార్పొరేట్ కంపెనీలు, బడా బాబులు ఎగవేసిన రుణాల నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయనే వాదనలు ఉన్నాయి. ఇంతటితో ఆగని బ్యాంకులు సామాన్య ప్రజలు, వేతన జీవులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన, విద్య, వ్యాపార రుణాలను ఈఎంఐల రూపంలో ముక్కు పిండి వసూళ్లు చేస్తాయి. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయవు.. సరికదా పొరపాటున ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే భారీగా పెనాల్టీలు కూడా విధిస్తాయి. ప్రజలు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా వసూలు చేసుకోవడానికి పాలకులు సిబిల్ స్కోర్‌ను తెరపైకి తీసుకు వచ్చారు. సిబిల్ స్కోర్ బాగా లేకపోతే తరువాత రుణాలు తీసుకోవడం కష్టం అవుతుందని, బ్యాంకులు రుణాలు ఇవ్వవని సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఒక రకమైన భయబ్రాంతులకు గురి చేసి బయట ఆస్తులను తెగనమ్ముకొనైనా ఈఎంఐలు సకాలంలో చెల్లించేలా చూస్తున్నాయి. పైగా ప్రతిసారీ వడ్డీ రేట్ల పెంపులతో మనకు తెలియకుండానే ఈఎంఐలను పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. ఇలా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా థాట్ పోలీసింగ్ చేసి డబ్బులు వసూళ్లు చేస్తున్న బ్యాంకులు, రుణాల పేరుతో కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయలు కట్టబెట్టి, చెల్లించకపోతే వాటిని రైటాఫ్ చేసి.. ప్రజలను లూటీ చేస్తున్నాయని ఆర్థిక రంగ విశ్లేషకులు చెపుతున్నారు.
బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని ఎగవేసిన టాప్ కంపెనీల్లో కొన్ని.. (రూ. కోట్లలో)
1) ఏబీసీ షిప్ యార్డ్ – 10,954
2) గీతాంజలి పవర్ అండ్ స్టీల్ – 8,090
3) భూషణ్ పవర్ అండ్ స్టీల్ – 6,413
4) బెటా నెఫ్తాల్ – 5,513
5) మెహుల్ చోక్సీ/ గీతాంజలి – 5,300
6) దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డిహెచ్ఎఫ్ఎల్) – 4,964
7) ఎంఎస్ రాకేశ్‌కుమార్ కుల్దీప్ సింగ్ వాధవాన్ – 4,425
8) ఎరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ – 3,908
9) అమ్‌టెక్ ఆటో – 3,788
10) కోన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ – 3,722
11) రాజా టెక్స్ టైల్స్ – 3,571
12) స్టెర్లింగ్ గ్లోబల్ ఆయిల్ రిసోర్సెస్ – 3,480
13) గిల్ట్ పాక్ – 3,207
14) ఆర్‌ఈఐ ఆగ్రో – 2,934
15) హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – 2,890
16) ర్యాంక్ ఇండస్ట్రీస్ – 2,853
17) దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – 2,827
18) ధీరజ్ రాజశేఖర్ వాధావన్ – 2,827
19) జీపీ కోహ్లీ – 2.827
20) హర్షీల్ మెహతా – 2,287
ఇవి కూడా చదవండి..
Medaram Jatara | మేడారం ట్రాఫిక్ జామ్‌పై పోస్ట్‌మార్టం.. వచ్చే జాతర నాటికి ప్రత్యామ్నాయ ప్రణాళిక
One Nation One Election | దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలేంటి?
Gas Filled Balloons Explosion : లిఫ్టులో పేలిన హైడ్రోజన్ గ్యాస్ బెలూన్లు.. షాకింగ్ వీడియో
