Hyderabad Metro | విధాత, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు టేకోవర్ కు ఆర్థికంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. మెట్రో రైలు ఫేజ్1 ప్రాజెక్టు వర్కింగ్ క్యాపిటల్ కు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్‌సీ) ద్వారా రూ.13,600 రీ ఫైనాన్సింగ్ చేసింది.
ఢిల్లీ లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్ఎమ్ఆర్ఎల్ ల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు పాల్గొన్నారు.
ఒప్పంద పత్రాలు మార్చుకున్న తరువాత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి హైదరాబాద్ మహానగరం ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, వేగంగా జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రుణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, జేఎండీ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పధకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఐఆర్ఎఫ్‌సీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతేడాది ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్ మంజూరు కావడంతో ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుంది. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితి తో ప్రతి మూడు నెలలకు ఒకసారి వాయిదాలో చెల్లింపుల విధానంలో రీ ఫైనాన్సింగ్ తక్కువ వడ్డీ మోత్తంతో మంజూరు చేశారు.
హైదరాబాద్ లో 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం రోజుకు సగటున 5 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మెట్రో భవిష్యత్ విస్తరణలకు బలమైన ఆర్థిక పునాది ఏర్పరచడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
Read More:
హైదరాబాద్ నగర ప్రజల త్రాగు నీటి అవసరాలకు మల్లన్న సాగర్ నీళ్ళు
