OTT | ఓటీటీ ప్రపంచం అంటే ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, రియాలిటీ కంటెంట్ చుట్టూనే తిరుగుతూ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ZEE5, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్రావెల్ లవర్స్ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్
తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ‘విహారి’ పేరుతో ఓ ప్రత్యేక ట్రావెల్ ఓటీటీ అందుబాటులోకి రానుంది. గత దాదాపు 18 ఏళ్లుగా బుల్లితెరపై ట్రావెల్ కథనాలు, పర్యాటక విశేషాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘విహారి’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.
ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, అక్కడి ప్రత్యేకతలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేక వంటకాలు, అడ్వెంచర్ ట్రిప్స్, ట్రావెల్ స్టోరీస్ వంటి ఆసక్తికర అంశాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక విజువల్ గైడ్‌లా ఉపయోగపడనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తెలుగులోనే తొలి ట్రావెల్ ఓటీటీ
తెలుగు భాషలో పూర్తిగా ట్రావెల్, టూరిజం కంటెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న తొలి ఓటీటీగా ‘విహారి’ గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త తరానికి తగ్గట్టుగా మరింత ఆసక్తికరమైన ట్రావెల్ కంటెంట్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ఫ్రాన్స్‌లో జరుగుతున్న 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘విహారి’ గ్లోబల్ విజన్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి శ్రీసత్య పాల్గొని ప్రివ్యూను ఆవిష్కరించారు.
జూన్‌లో అధికారిక లాంచ్
విహారి ఓటీటీని వచ్చే జూన్ నెలలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాల సంస్కృతులు, అందమైన పర్యాటక ప్రాంతాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ప్రత్యేక రుచులు, స్థానిక జీవనశైలికి సంబంధించిన అంశాలను ఇందులో చూపించనున్నారు.
తెలుగు ప్రేక్షకులకు వినోదంతో పాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించేలా ఈ ప్లాట్‌ఫామ్ రూపొందుతోందని, ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి ఇది కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కొత్త కాన్సెప్ట్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
