• Telugu News
  • /Sports

వరుసగా ఐదు వికెట్ మెయిడిన్ ఓవర్లు .. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు

పాకిస్థాన్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ వరుసగా ఐదు వికెట్ మెయిడిన్ ఓవర్లు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్టువర్ట్ బ్రాడ్ రికార్డును అధిగమించాడు.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Jul 28, 2026, 3:53 pm IST
Read Time: 3 mins
వరుసగా ఐదు వికెట్ మెయిడిన్ ఓవర్లు .. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు

ట్రినిడాడ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో తన తొలి ఐదు ఓవర్లలో గ్రీవ్స్ 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తన సెకండ్ స్పెల్‌లో మాత్రం ఈ పేస్‌ ఆల్‌రౌండర్ ఒక్క పరుగూ ఇవ్వకుండా.. వరసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. 2016 జనవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్ వరసగా నాలుగు వికెట్ మెయిడిన్ల రికార్డును జస్టిన్ గ్రీవ్స్ తాజాగా బ్రేక్ చేశాడు.

విండీస్, పాక్‌ తొలి టెస్టులో .. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్తాన్ మూడో రోజు ఆటలో 244/4 స్కోరుతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న క్రమంలో జస్టిన్ గ్రీవ్ తన రెండో స్పెల్ మొదలుపెట్టి పాక్ బ్యాటర్లకు వరుస షాక్ లు ఇచ్చాడు. తన వరస ఓవర్లలో షాన్ మసూద్ (109), ఆమీర్ జమాల్ (3), అలీ ఉస్మాన్ (0), మహ్మద్ రిజ్వాన్ (12), మహ్మద్ అబ్బాస్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. గ్రీవ్స్ దెబ్బకు పాక్ అనూహ్యంగా 282 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ 126/7తో నిలిచి 155 పరుగుల ఆధిక్యంలో ఉంది.