జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రవ రిక్టర్‌స్కేల్‌పై 7.1 గా నమోదైంది. నాగసాకికి 80 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత నేపథ్యంలో జపాన్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా 1 మీటర్ల (3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.
జపాన్‌లోని దక్షిణ క్యుషు (Kyushu) ద్వీపంలో ఉన్న కుమమోటో, నగాసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియజాకి ప్రిఫెక్చర్‌లకు హెచ్చరికలను జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భూకంపం క్రమంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు వెల్లడికాలేదు. పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (PTWC) ఈ భూకంపం కారణంగా హవాయి, అమెరికన్ సమోవా ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది.