కాకతీయ రాజుల చరిత్ర పరిశోధన క్రమంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని తొలి శిల్పం వెలుగుచూడటం ఆసక్తి రేపింది. సిద్దిపేట జిల్లా తోటపల్లి శివాలయంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ లు ఈ అరుదైన శిల్పం వివరాలు వెల్లడించారు. తెలంగాణలో గణపతి దేవుడి తొలి శిల్పం ఇదేనని వారు తెలిపారు. ఈ శిల్పంలో గణపతి దేవుడు, సతీమణి సోమలా దేవి దంపతులతో పాటు రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులు, పరిచారికల ప్రతిమలు ఉన్నాయి. గోళకి మఠాధిపతి, రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుల అర్చకత్వంలో శివ దీక్షలో గణపతి దేవుడు సతీ సమేతంగా శివలింగానికి పూజ చేస్తున్నట్లుగా శిల్పం దర్శనమిస్తుంది.
శిల్పంలో గణపతిదేవుడు రుద్రాక్ష మాలలు, ఆభరణాలు, ధరించి, తలపై శిఖ, విలక్షణమైన ముడి ఆకారంలో ఉన్న రాజ శిరోభూషణాన్ని (Bun-shaped royal headgear) ధరించిన పరమ శైవుడిగా కనిపిస్తున్నారు, సోమలాదేవి ఆభరణాలు, సాంప్రదాయ ‘ధమ్మిల్ల’ శైలి హెయిర్ డ్రెస్ తో కనిపిస్తున్నారు. గణపతి దేవుడు, సోమలాదేవి శిల్పంలో ఆనాటి చక్రవర్తి, పట్టపు రాణిల రాచరికపు ఆహార్యం, వేషధారణ విశేషాలు తెలుసుకునే అవకాశం లభించినట్లయ్యింది. తెలుగు నేలను క్రీ.శ.1199నుంచి 1262వరకు పాలించిన గణపతి దేవుడు చక్రవర్తిగా కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆయన వారసత్వాన్ని రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రులు కొనసాగించారు. దేవగిరి యాదవ రాజు జైతుగి, బాలుడైన గణపతి దేవుడిని చెరలో పెట్టాడు. అయితే రేచర్ల రుద్రుడి దౌత్యంతో అతడిని జైలు నుంచి విడుదల చేసిన జైతుగి తన కూతురైన సోమలదేవిని గణపతిదేవుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు చింతలూరు తామ్ర శాసనం చెపుతుంది.
తెలంగాణ చరిత్రలో కాకతీయ గణపతి దేవుడిది ఒక ప్రత్యేక స్థానం. సువిశాల కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం, తాను స్వయంగా 60 ఏండ్లకుపైగా పాలించటం వంటి రాజకీయ విజయాలు ఆయనకున్నాయి. స్వతంత్ర కాకతీయ రాజ్యానికి రుద్రదేవుడు బీజం వేస్తే దానిని మహావృక్షంగా పెంచినవాడు గణపతి దేవుడు. ముఖ్యంగా ఆనాటి పితృస్వామ్య విలువలున్న మధ్యయుగ సాంప్రదాయాలకు భిన్నంగా కూతురైన రుద్రమదేవిని పాలకురాలిగా ప్రకటించి తన కాలాన్ని, సమకాలీన సమాజంలో విప్లవాత్మక మార్పును ఆవిష్కరించిన సంస్కరణ వాదిగా నిలిచారు. భారత ఉపఖండంలో ఆరు దశాబ్దాలకు పైగా పాలించిన రాజులలో ఒకరు రాష్ట్రకూట అమోఘవర్షుడు, రెండవ వారు కాకతీయ గణపతి దేవుడు. ఇద్దరూ 64 ఏండ్లు పాలించారు. ఈ అరుదైన ఘనత దక్కిన వీరిద్దరూ దక్కను ప్రాంతానికి చెందిన వారే కావటం విశేషం.
దొరికిన శాసనాల్లో చివరిదైన క్రీ.శ.1260 నాటి శాసనం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దొరికింది. ఈ శాసనంలో స్పష్టంగా ‘దివ్య రాజ్య సంవత్సరములు 62 అగు’ అని రాయడంతో 1260 నాటికి గణపతి దేవుడి 62 ఏండ్ల పాలన పూర్తి అయిందని భావించాలి. గణపతి దేవుడి పాలనా కాలం క్రీ.శ.1262 వరకు అని ఆధారాలు తెలుపుతున్నందున ఈయన కనీసం 64 ఏండ్లు పాలించాడని చరిత్రకారుల కథనం. గణపతి దేవుడికి ‘రాయగజకేసరి’ బిరుదుతో పిలిచేవారు.
ఇవి కూడా చదవండి :
బోరుబావికి ‘అంత్యక్రియలు’..వైరల్ వీడియో
మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం
