విధాత : ఇబ్రహీంపట్నంలో బీఆరెస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి వర్గాల మధ్య నామినేషన్ దాఖలు సందర్భంగా తలెత్తిన ఘర్షణ లాఠీచార్జీకి దారితీసి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నామినేషన్ దాఖలుకు మల్‌రెడ్డి, మంచిరెడ్డిలు భారీ ర్యాలీలతో తరలివచ్చారు. ఇరువైపుల మోహరించిన రెండు పార్టీల శ్రేణుల మధ్య తలెత్తిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్నారు. దీంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టాయి.
ఘర్షణలో ఇరువర్గాలకు సంబంధించిన పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు నామినేషన్ సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో మల్‌రెడ్డి రంగారెడ్డి తన వాహనం దిగి నడుచుకుంటూ ఆర్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. కాగా చెన్నూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఒకే సమయంలో బీఆరెస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేక్‌లు భారీ ర్యాలీలతో తరలివచారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తగాదా ఏర్పడగా ఇక్కడ కూడా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.