న్యూఢిల్లీ: సెక్యూరిటీ ఎక్సేంజి బోర్డు (సెబీ) తన మాటపై నిలబడి.. అదానీ గ్రూపు అవకతవకలపై సకాలంలో విచారణను పూర్తి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ డిమాండ్ చేశారు. దేశంలో వెలుగు చూసిన అదానీ -మోదీ దోస్తీ, దాని పర్యవసానాలు, అదానీ పాల్పడిన మెగా స్కాములు, ఆర్థిక లోటుబాట్లు, రాజకీయ- ఆర్థిక నేరాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ మాత్రమే సరైన పద్ధతిలో విచారణ జరుపగలదని అన్నారు.
కానీ.. జేపీసీని ఏర్పాటుకు నిరాకరించి, సెబీకి ఈ విచారణ బాధ్యత అప్పగించడం ద్వారా ఫలితాలను తారుమారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంత భారీ స్కాములపై విచారణ సెబీకి అప్పగించడం రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్య అని ఆయన ఆరోపించారు.