చింతపల్లి పీఎస్ లో లాకప్ డెత్

నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి కారణమంటూ బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు

  • Publish Date - December 11, 2023 / 02:20 PM IST

– సివిల్ కేసులో తలదూర్చిన ఎస్ఐ సతీష్ రెడ్డి

– స్టేషన్ కు పిలిచి విచారిస్తుండగా కుప్పకూలిన బాధితుడు

– పోలీసుల వేధింపులే కారణమంటూ బంధువుల ఆందోళన

– ఎస్ఐను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన ఎస్పీ

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి కారణమంటూ బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. దేవరకొండలోని చింతపల్లి పీఎస్ పరిధిలో పాలెం తండాకు చెందిన అన్నదమ్ములు నేనావత్ సూర్య నాయక్, భీమ్లా నాయక్ మధ్య భూ పంచాయితీ గత కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో సూర్య నాయక్ కుమారుడైన కిరణ్ తన బాబాయ్ భీమ్లా నాయక్ వద్ద రెండేళ్ల క్రితం రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య కొంతకాలంగా డబ్బు కోసం పంచాయితీ కొనసాగుతోంది.


ఇదిలాఉండగా సూర్య నాయక్, భీమ్లా నాయక్ తల్లి ఇటీవల మృతి చెందింది. వారి తల్లి పేరిట ఉన్న భూమిని అన్నదమ్ములు సమాన భాగంగా పంచుకోవాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో భీమ్లా నాయక్ తన వద్ద తీసుకున్న రూ.3లక్షలు చెల్లించాలంటూ కోరగా, భూమి సమస్యను తీరిస్తేనే అప్పు తీరుస్తానని కిరణ్ తెగేసి చెప్పాడు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సూర్య నాయక్, అతని కుమారుడిని పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పగా వారు రాలేదు. దీంతో ఆదివారం సాయంత్రం పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఎస్సై సతీష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.


సూర్య నాయక్ కుమారుడు కిరణ్ ను పోలీసులు విచారిస్తున్న సమయంలో సూర్య నాయక్ మధ్యలో కలగజేసుకున్నాడు. దీంతో పోలీసులు ఆయనను వారించి బయటికి పంపించారు. అప్పటికే హైబీపీతో సూర్యనారాయణ కింద పడిపోగా, పోలీసులే హుటాహుటిన తమ వాహనంలో దేవరకొండ ఆసుపత్రికి తరలించారని, అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన

పోలీస్ స్టేషన్ కు వచ్చిన సూర్య నాయక్ పై ఎస్సై సతీష్ రెడ్డి దురుసుగా వ్యవహరించడమే కాకుండా చేయి చేసుకోవడంతో హైబీపీతో సూర్యనాయక్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహమే సూర్య నాయక్ ను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఎస్సై సతీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది. విధుల్లో ఉన్న చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డిని జిల్లాకేంద్రంలోని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.