Nizamabad |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపైనే ఉన్న బ్రిడ్జి వద్ద ఆరిఫ్ డాన్ అనే రౌడీషీటర్ ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు.
ఈరోజు బోధన్ కోర్టులో వాయిదాకు హాజరై నిజామాబాద్‌కు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అతని అనుసరించి వస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన ప్రత్యర్థులు ఈ హత్య చేసినట్టు సమాచారం. నిజామాబాద్ నగరానికి చెందిన ఆరిఫ్ డాన్ పై రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి.
జనవరి 1న నిజామాబాద్ నగర శివారులోని నెహ్రు నగర్‌లో జంగల్ ఇబ్బు అలియాస్ ఇబ్రహీం అనే రౌడీషీటర్‌ను హత్య చేసి మూడు నెలల క్రితమే జైలు నుంచి ఆరిఫ్ విడుదలయ్యాడు. ఆరిఫ్ జైలు నుంచి విడుదల తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అనుకున్నప్పటికీ రెగ్యులర్ సీపీ లేక పోవడంతో వాయిదా పడింది.
ఈ సమయంలోనే ప్రత్యర్థుల చేతిలో ఆరిఫ్ డాన్ హతమయ్యాడు. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆరిఫ్ డెడ్ బాడీని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరిఫ్‌ను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.