బ‌రితెగించిన ఫినిక్స్‌.. అర్థ‌రాత్రి ప్రైవేట్ భూముల క‌బ్జాయత్నం

ఎవ‌రైనా త‌మ‌కు భూమి కావాల‌న్నా... లేదా ఒక ప్లాట్ కావాల‌న్నా భూ య‌జ‌మానిని క‌లిసి అమ్ముతారా? అని అడుగుతారు. భూ య‌జ‌మానికి డ‌బ్బులు అవ‌స‌రం ఉండి అమ్ముకుంటే కొనుగోలు చేస్తారు.

  • Publish Date - April 17, 2024 / 08:45 PM IST

అడ్డుకున్న భూ య‌జ‌మానుల‌పై దాడి
రాచ‌కొండ క‌మిష‌న‌ర్‌కు బాధితుల ఫిర్యాదు
శ్రీనిధి వెంచ‌ర్‌, కృష్ణంరాజు, బాబురావులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌

ఎవ‌రైనా త‌మ‌కు భూమి కావాల‌న్నా… లేదా ఒక ప్లాట్ కావాల‌న్నా భూ య‌జ‌మానిని క‌లిసి అమ్ముతారా? అని అడుగుతారు. భూ య‌జ‌మానికి డ‌బ్బులు అవ‌స‌రం ఉండి అమ్ముకుంటే కొనుగోలు చేస్తారు. భూ య‌జ‌మానికి అమ్మ‌డం ఇష్టం లేకపోతే వెన‌క్కు వెళ‌తారు. ఆ భూమి త‌మ‌కు త‌ప్ప‌ని స‌రిగా అవ‌స‌రం ఉంద‌నుకుంటే మార్కెట్ రేటు కంటే అధికంగా చెల్లించి కొనుక్కునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ ఫినిక్స్ కానీ, ఈ సంస్థ‌కు చెందిన ఇత‌ర కంపెనీలు కానీ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త‌మ‌కు కావాల‌నుకున్న భూమిని డ‌బ్బులు పెట్టి కొనుక్కోరు.. దౌర్జన్యంగా గుంజుకుంటారు. త‌మ భూమిలో క‌లిపేసుకుంటారు. అడ్డొస్తే మ‌క్కెలిర‌గ తంతారు. ఇదేమిటంటే దిక్కున్న చోట చెప్పుకో పో అని బెదిరిస్తారని బాధితులు చెబుతున్నారు. ఇలా త‌మ వెంచ‌ర్ల ప‌క్క‌న ఉన్న చిన్న చిన్న ప్లాట్ల‌ను దౌర్జ‌న్యంగా గుంజుకోవ‌డ‌మే ప‌నిగా ఫినిక్స్ బ‌రితెగించి క‌బ్జాలు చేస్తోందని అంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మామిడిప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాదాపు 30 మంది గుండాల‌తో త‌మ వెంచ‌ర్‌కు ఆనుకొని ఉన్న ర‌ఘు అలేఖ్ అనే వ్య‌క్తి చెందిన భూమిని ఆక్ర‌మించుకునే ప్ర‌య‌త్నం చేసింది. అడ్డుకున్న వాచ్‌మెన్‌పై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడికి పాల్ప‌డింది. బాధితులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని పోలీస్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు.

విధాత‌: ఫీనిక్స్ బ‌రి తెగించింది. త‌మ వెంచ‌ర్ల పక్క‌న ఉన్న ప్రైవేట్ వ్య‌క్తుల భూముల‌ను దౌర్జ‌న్యంగా క‌బ్జా చేస్తోంది. అడ్డుకుంటే దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఇలా హైద‌రాబాద్‌లో విలువైన భూముల‌ను క‌బ్జా చేస్తోంది. పాల‌కులు ఎవ‌రైనా కానీ అంతా మావారే.. ఎవరూ తమను ఏమీ చేయలేరన్నట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన ఈ సంస్థ పెద్ద‌లు అప్ప‌ట్లో ఇలాగే త‌మ ప‌లుకుబ‌డి ఉప‌యోగించి వంద‌ల ఎక‌రాల ప్రైవేట్ భూముల‌ను అడ్డ‌గోలుగా రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. ఇలా హైద‌రాబాద్ చుట్టూ వంద‌ల ఎక‌రాల భూములపై క‌న్నేసిన ఈ బ‌డా సంస్థ‌, త‌మ వెంచ‌ర్ల‌కు ప‌క్క‌నే ఉన్న‌చిన్న చిన్న భూ క‌మ‌తాల‌ను కూడా వ‌ద‌లిపెట్ట‌డం లేదని తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌ల‌ను ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లంలోని మేడిప‌ల్లి గ్రామంలో ఫీనిక్స్ కంపెనీ 50 ఎక‌రాల వెంచ‌ర్ చేస్తోంది. ఈ 50 ఎక‌రాల‌కు ఆనుకొని ర‌ఘు అలేఖ్‌కు 1300 గ‌జాల స్థ‌లం ఉన్న‌ది. ఈ స్థ‌లంపై క‌న్నేసిన ఫీనిక్స్ పెద్ద‌లు రాబందుల్లా మారి అడ్డ‌గోలుగా క‌బ్జా చేసేందుకు ఉప‌క్ర‌మించారు. మొద‌టిసారిగా 2022 అక్టోబ‌ర్‌18వ తేదీన భూ క‌బ్జాకు ప్ర‌య‌త్నించారు. ఆ త‌రువాత 2024 మార్చి 31వ తేదీన రెండ‌వసారి ప్ర‌య‌త్నించారు. తాజాగా 16 ఏప్రిల్‌2024 మంగ‌ళ‌వారం అర్థరాత్రి మూడ‌వ సారి భూమిని క‌బ్జా చేయ‌డానికి ప్ర‌య‌త్నించి దాడుల‌కు తెగ‌బ‌డ్డారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫీనిక్స్ సంస్థ ప్ర‌తినిధులు రంగారెడ్డి జిల్లా మామిడిప‌ల్లిలోని స‌ర్వే నంబ‌ర్ 59లో 50 ఎక‌రాల భూమిలో వెంచ‌ర్ చేస్తున్నారు. ఈ వెంచ‌ర్‌కు ముందు భాగంలో స‌ర్వే నంబ‌ర్ 306లో ర‌ఘు అలేఖ్‌కు 1300 గ‌జాల ప్లాట్ ఉన్న‌ది. ఈ ప్లాట్‌ను క‌బ్జా చేయడానికి వీళ్లు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హ‌ద్దులు చెరిపారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్ర‌యించ‌గా కోర్టు అడ్వ‌కేట్ క‌మిష‌న్‌ను నియ‌మించింది. అడ్వ‌కేట్ క‌మిష‌న్ రెవెన్యూ అధికారుల‌తో స‌ర్వే చేయించి హ‌ద్దులు ఫిక్స్ చేసి వెళ్లింది. ఈ మేర‌కు ర‌ఘు అలేఖ్ బౌండ‌రీ నిర్మించిన బేస్‌మెంట్ నిర్మించుకొని క‌డీలు పెట్టి ఫెన్సింగ్ వేసుకున్నారు. అలేఖ్ త‌న ప్లాట్‌లో కంటైన‌ర్ రూమ్ వేసి, వాచ్‌మెన్‌ను కూడా ఉంచారు. వాచ్‌మెన్‌ ఇందులోనే నివాసం ఉంటున్నారు.

ఈ 1300 గ‌జాల భూమిపై క‌న్నేసిన ఫీనిక్స్.. దాన్ని ఆక్ర‌మించుకోవ‌డానికి దౌర్జన్యానికి తెగ‌బడింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాదాపు 30 మంది బౌన్స‌ర్‌లు, జేసీబీలతో వ‌చ్చి బౌండ‌రీ చుట్టూ నిర్మించుకున్న బేస్‌మెంట్‌ను కూల్చివేశారు. అడ్డుకోబోయిన ర‌ఘు అలేఖ్ మేనేజ‌ర్ శ్రీ‌రామ్‌, వాచ్‌మెన్ రాజుల‌పై దాడి చేశారు. వాచ్‌మెన్ ఉంటున్న కంటైన‌ర్‌ను తీసివేశారు. దీనిపై భూ య‌జ‌మాని ర‌ఘు అలేఖ్ రాచ‌కొండ పోలీస్ కమిష‌న‌ర్‌, మ‌హేశ్వ‌రం డీసీపీల‌కు ఫిర్యాదు చేశారు. శ్రీనిధి వెంచ‌ర్‌తోపాటు.. కృష్ణంరాజు, బాబురావుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో కోరారు. అడ్వ‌కేట్ క‌మిష‌న్ హ‌ద్దులు నిర్ణ‌యించిన త‌రువాత కూడా భూమిని క‌బ్జా చేయ‌డంపై బాధితులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Latest News