సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పోలీసులకు చిక్కాడు. 11 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం గద్వాల డీఐజీ చౌహన్ కేసు వివరాలు వెల్లడించారు

  • Publish Date - December 12, 2023 / 02:29 PM IST

– 11 హత్య కేసుల్లో నిందితుడిగా మాంత్రికుడు

– రియల్ వ్యాపారంలోనూ దందా

– ఒకే కుటుంబంలో నలుగురి హత్య కేసులో సంబంధం

– పోలీసుల అదుపులో మాంత్రికుడు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పోలీసులకు చిక్కాడు. 11 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం గద్వాల డీఐజీ చౌహన్ కేసు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన కంటాది సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. దీంతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన తాంత్రిక విద్య నేర్చుకున్నాడు. భూముల కొనుగోలు, విక్రయాలు చేస్తున్న సమయంలో అతనికి సహకరించని భూ యజమానులను తన తాంత్రిక విద్యతో ఆకట్టుకునేవాడు. అప్పులు చేసి మళ్ళీ ఇచ్చేవాడుకాదని.. అడిగిన వారికి పూజలు చేస్తే గుప్త నిధులు దొరుకుతాయని నమ్మబలికే వాడు. గుప్త నిధుల పేరుతో పూజలు చేయిస్తున్న సమయంలో హత్యలు చేసేవాడు. భూముల వద్ద పూజలు చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికేవాడు.


ఇలా లొంగదీసుకుని భూ యజమానులతో పూజల పేరుతో భూముల వద్ద పూజలు చేయించే సమయంలో తేజాబ్ (బంగారు కరగ దీసే రసాయనం) పాలల్లో కలిపి భూ యజమానికి ఇచ్చేవాడు. పాలు తాగిన తర్వాత బండ రాళ్ళతో కొట్టి చంపేవాడు. ఇలా తన మాటవినని భూ యజమానులను 11 మందిని చంపినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. నిందితుడు గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా లో ఈ హత్యలు చేసాడని నాగర్ కర్నూల్ గద్వాల డీఐజీ చౌహన్ వెల్లడించారు. గతంలో వనపర్తి జిల్లాలో ఇదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసినట్లు డీఐజీ తెలిపారు. ఇటీవల వనపర్తికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ సందర్భంలో నాగర్ కర్నూల్ కు చెందిన సత్యనారాయణపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ దిశగా పోలీసులు రంగంలోకి దిగి సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇదివరకే 8 కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి ఈ హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటామని డీఐజీ తెలిపారు. అందరూ ఒకే మాదిరిగా చనిపోయారు… వీరంతా విష ప్రభావంతో చనిపోయినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించినా నిందితుణ్ణి పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారు.

Latest News