హత్యాయత్నం కుట్రపై విచారణ జరిపిస్తాం: మంత్రి హరీష్ రావు

  • Publish Date - October 30, 2023 / 11:32 AM IST

– ఎంపీ ప్రభాకర్ కు పరామర్శ

– కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా

– మంత్రితో ఫోన్ ద్వారా ఆరా తీసిన సీఎం

– మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన.. కుట్ర కోణంపై విచారణ జరిపిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచార సందర్భంగా ఓ వ్యక్తి హఠాత్తుగా కత్తితో దాడి చేసిన ఘటనలో గాయపడ్డారు. ఎంపీని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.


 


ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి, చికిత్సపై డాక్టర్లతో మంత్రి చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు. కుట్రపై విచారణ జరిపిస్తామని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ఎంపీ సతీమణి మంజుల రెడ్డి, కుమారుడు కృష్ణా రెడ్డికి ఆసుపత్రిలో ధైర్యం చెప్పారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి హరీష్ రావుతో ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.