విధాత, నిజామాబాద్: పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్‌కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సళీ కేంద్రం, వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
సమాజంలో మహిళలు, బాలికలు మానసిక, శారీరక హింసలకు గురైతే షీ టీమ్స్ కు సమాచారం అందిస్తే అవసరమైన సహకారం లభిస్తుందని చెప్పారు. బాధిత మహిళలు మానసిక, శారీరక సమస్యలతో సఖీ కేంద్రానికి వెళ్తే కౌన్సెలింగ్ చేసి మనోధైర్యాన్నికల్పిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్ ఉచితంగా సఖీ కేంద్రం ద్వారా అందిస్తారని తెలిపారు. ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా జరిగితే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. బ్యానర్ పై స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి, అధికారులు సంతకాలు చేశారు. సమావేశంలో ఆర్టీవో వాణి, ప్రతినిధులు స్వర్ణలత, పోశవ్వ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.