Site icon vidhaatha

TTD | తిరుమల దర్శనానికి వెళ్తున్నారా..? అయితే మీకో అద్భుత అవకాశం..!

TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే వసంతోత్సవం వేడుకల్లో భక్తులు పాల్గొనవచ్చని తెలిపింది. కార్యక్రమంలో పాల్గొన్న జంటలకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేయనున్నట్లు పేర్కొంది. ఈ నెల 27 నుంచి 29 వరకు కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి.

వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లను ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలిరోజు శ్రీనివాసుడు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఆఖరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థమని ఆలయ పండితులు తెలిపారు. రెండోరోజు 28న సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. రెండురోజులు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవం వేడుకల్లో ఆసక్తి ఉన్న గృహస్తులు రూ.516 చెల్లించి పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఉత్సవాల కారణంగా 27 నుంచి 29 వ‌ర‌కు కల్యాణోత్సవం, 28న స్వర్ణపుష్పార్చన, 29న అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్నది.

Exit mobile version