Site icon vidhaatha

Bonalu Festival | భాగ్య‌న‌గ‌రంలో బోనాల జాత‌ర‌.. ఈ ఆల‌యాల్లో బోనం స‌మ‌ర్పిస్తే ఎంతో పుణ్యం..!

Bonalu Festival | హైద‌రాబాద్ : ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి( Ujjaini Mahankali ) అమ్మ‌వారి ఆల‌యంలో బోనాల జాత‌ర( Bonala Jathara ) నిర్వ‌హించనున్నారు. ఈ బోనాల‌నే ల‌ష్క‌ర్ బోనాలు( Lashkar Bonalu ) అని పిలుస్తారు. ల‌ష్క‌ర్ బోనాల‌కు ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యం సిద్ద‌మైంది. సికింద్రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల వారు మ‌హంకాళి అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. ల‌ష్క‌ర్ బోనాలు జ‌రిగిన మ‌రుస‌టి వారం పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జర‌గ‌నుంది.

ఈ రెండు ఆల‌యాల‌తో మ‌రిన్ని ఆల‌యాల్లో కూడా బోనాల పండుగ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆల‌యాల్లో కూడా బోనం స‌మ‌ర్పిస్తే ఎంతో పుణ్యం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యం, హరిబౌలి అక్కన్నమాదన్న దేవాలయం, సుల్తాన్‌షాహి జగదాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ, మహంకాళి దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం మేకలబండ, మహాకాళేశ్వరస్వామి దేవాలయం మీరాలమండి, దర్బార్‌ బంగారు మైసమ్మ దేవాలయం అలియాబాద్‌, క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం లోయ‌ర్ ట్యాంక్ బండ్.. ఈ ఆల‌యాల్లో కూడా బోనాలు స‌మ‌ర్పించి త‌మ మొక్కులు చెల్లించుకోవ‌చ్చు.

ఉజ్జ‌యిని మహంకాళి ఆల‌యం..

శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవస్థానం సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉంటుంది. బోనాల సంబురాల్లో ఈ దేవాలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బోనాలు ప్రారంభమైన మూడో వారంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవ స్థానానికి బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సైతం హాజరవుతారు. ఒకప్పుడు బోనాల సంప్రదాయం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెబుతుంటారు.

బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యం..

హైదరాబాద్‌లోని అమీర్‌పేట సమీపంలో ఉండే బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలోనూ శ్రీ ‘రేణుకా ఎల్లమ్మ’ దేవస్థానంలో బోనం సంబురాలు ఘనంగా జరుగుతాయి. బోనాలు ప్రారంభమైన మొదటి ఆదివారమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి.

లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆల‌యం..

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఉండే లాల్ దర్వాజాని 1907లో నిర్మించారు. అప్పట్లో నిజాం ప్రభువులు ఈ ఆలయంలో బోనాల సంబురాలను ప్రారంభించారు. చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి ఈ ఆలయం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని అక్కన్న-మాద‌న్న అనే పేర్లతోనూ పిలుస్తారు. ఇక్కడ జరిగే ఏనుగు అంబారీ ఊరేగింపుకు చాలా ప్రత్యేకత ఉంది.

ద‌ర్బార్ మైస‌మ్మ ఆల‌యం

పాతబస్తీలోని ప్రముఖ అమ్మవారి దేవాలయాల్లో దర్బార్ మైసమ్మ గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున ఈ ఆలయంలో బోనాల సంబురాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి పాతబస్తీ నుంచే కాకుండా జంట నగరాల చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ అమ్మవారి దర్శనానికి వస్తారు.

క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం..

జంట నగరాల్లో కట్ట మైసమ్మ ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే అన్నింటికంటే శ్రీ కనకాల కట్ట మైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ నిర్మించే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట. ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆలయానికి భక్తులు అధికంగా వచ్చేవారట. అంతేకాదు 1908లో మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా మైసమ్మ తల్లిని నిజాం ప్రభువు మొక్కుకున్నారట. అందుకే ఆ కాలం నుంచే ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఏర్పడింది.

Exit mobile version