న్యూఢిల్లీ : అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నలుగురు ప్రముఖ శంకరాచార్యులు దూరంగా ఉంటున్నారు. వీరిలో ముగ్గురు బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను సమర్థించినప్పటికీ.. ఒకరు మాత్రం ఈ కార్యక్రమానికి అనుసరిస్తున్న పద్ధతులపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అయితే.. తమ గైర్హాజరు రాముడి పట్ల భక్తి లేకనో లేదా మోదీ వ్యతిరేకతో కాదని వారు స్పష్టం చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము వ్యతిరేకమని మీడియాలో వస్తున్న వార్తలను వారు ఖండించారు. అవి అవాస్తవాలని తేల్చి చెప్పారు.
శంకరాచార్యులు ఏమంటున్నారు?
ఎనిమిదో శతాబ్దానికి చెందిన అద్వైత వేదాంత సంప్రదాయ ఆది శంకరాచార్యుడు దేశంలోని నలు మూలల నాలుగు ప్రధాన మఠాలను నెలకొల్పారు. వాటిలో ఒకటి ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఉన్న జ్యోతిర్ మఠ్, మిగిలిన మూడింటిలో ఒడిశాలోని పూరీలో గోవర్ధన్ మఠ్, కర్ణాటకలోని శృంగేరిలో ఉన్న శృంగేరీ శారదా పీఠం, గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ద్వారకా శారదా పీఠం ఉన్నాయి. దేశంలోని నాలుగు దిక్కులలో ఉన్న పవిత్ర ప్రదేశాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటుంటారు. అయితే.. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాకపోవడం మొదటగా పూరీ గోవర్ధన్ మఠ్ శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద్ సరస్వతి వ్యాఖ్యల నేపథ్యంలో ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం సందర్భంగా పాటిస్తున్న పద్ధతులు శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు మాట్లాడారో తెలియని వీడియో ఒకటి ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయోధ్యలోని రామాలయం పట్ల తనకేమీ అభ్యంతరాలు లేనప్పటికీ తన స్థానం గౌరవానికి సంబంధించి సృహ కలిగి ఉన్నానని నిశ్చలానంద వ్యాఖ్యానించడం అందులో ఉన్నది. ‘మర్యాద పురుషోత్తమ రాముడిని గౌరవించుకోవాలంటే అది శాస్త్రాల ప్రకారం ఉండాలి.
నేనేమీ నిరసన వ్యక్తం చేయను. కానీ.. నేనే వెళ్లేది కూడా లేదు. ఇది సంతోషానికి సంబంధించిన అంశం. శాస్త్రాలకు అనుగుణంగా గౌరవం, పూజలు ఉండాలి. నేను ఆ కార్యక్రమానికి వెళ్లి ఏం చేయాలి?’ అని నిశ్చలానంద పేర్కొన్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన కొన్ని రోజులకే జ్యోతిర్ మఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సైతం అయోధ్య కార్యక్రమం శాస్త్రాలకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయ నిర్మాణ బాధ్యతలను శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర పర్యవేక్షించింది. అయితే.. ఈ ఆలయాన్ని ప్రాణప్రతిష్ఠకంటే ముందే రామానంద్ కమ్యూనిటీకి అప్పగించాలని అవిముక్తేశ్వరానంద్ అన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపట్‌రాయ్.. అయోధ్య రామాలయం వైష్ణవులకు చెందని రామానంద సంప్రదాయకులదని అన్నారు. ఇది సన్యాసులు, శైవులు, లేదా శక్తిపీఠాల వారికి సంబంధించినది కాదని వ్యాఖ్యానించడం వివాదం రేపింది. ఆలయం నిర్మాణంలో ఉండగానే విగ్రహాలను ప్రతిష్ఠించడం శాస్త్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని జ్యోతిర్ మఠ్ శంకరాచార్య అభిప్రాయపడ్డారు. అయితే.. తాము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వ్యతిరేకమని మీడియాలో వస్తున్న వార్తలను శృంగేరి శంకరాచార్య స్వామి భారతి తీర్థ, ద్వారక పీఠం శంకరాచర్య స్వామి సదానంద సరస్వతి ఖండించారు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి ఆలయ ప్రారంభోత్సవం ఆనందదాయకమైన అంశమని శృంగేరీ శంకరాచార్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పవిత్రమైన సందర్భమని, ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని ఆనందించాల్సిదని ఆయన అన్నారు. కానీ కొంతమంది తన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము ఎప్పుడూ అయోధ్యలో కార్యక్రమాన్ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అటువంటి దుష్ప్రచారాలకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
పూర్తికావడానికి రెండేళ్లు?
రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమైనప్పటికీ.. ఆలయం పూర్తికావడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆలయం మొదటి అంతస్తు, గర్భగుడి మాత్రమే పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా రెండేళ్లయినా పడుతుందని అంటున్నారు.